బిజెపికి ప్రతికూల పవనాలు

Mar 31,2024 22:51

సమావేశంలో మాట్లాడుతున్న రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు
ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ :
దేశవ్యాప్తంగా బిజెపి దానికి మద్దతిచ్చే పార్టీలకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు అన్నారు. బిజెపికి మేకపోతు గాంభీర్యం మినహా సానుకూల పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవన్నారు. మండలంలోని చినకాకానిలో సిపిఎం విస్తృత సమావేశం ఆ పార్టీ నాయకులు వి.పూర్ణయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. సిపిఎం నాయకులు వై.గంగాధర్‌రావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించిననానంతరం మధు మాట్లాడారు. ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోవడానికి బిజెపి వద్ద ఒక్క అంశం కూడా లేదన్నారు. అధికారంలోకి వచ్చాక నల్ల ధనాన్ని వెలికి తీస్తాం, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అని నమ్మించి దేశాన్ని మోసం చేసిందన్నారు. అవినీతికి తాము వ్యతిరేకం అని చెప్పుకుని ఇప్పుడు అదే అవినీతిలో కూరుకుపోయిందని, అతిపెద్ద కుంబకోణమైన ఎలక్టోరల్‌ బాండ్లు అందుకు తాజా ఉదాహరణని చెప్పారు. అయితే దీన్నుండి ప్రజల దృష్టి పడకుండా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టును రంగం మీదికి తెచ్చిందన్నారు. అరెస్టుపై ఇతర దేశాలూ చర్చిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయని పార్టీకి రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. ఈ నేపథ్యంలో ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ బిజెపి పాలనలో దేశ వనరులన్నింటినీ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క పైసా నిధులివ్వలేదని, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, దుగ్గరాజుపట్నం పోర్టు, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటును విస్మరించి అన్యాయం చేసిందని మండిపడ్డారు. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలతోపాటు నిత్యావసరాల ధరలనూ విపరీతంగా పెంచారని, చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చారని అన్నారు. పంటలకు మద్దతు ధర హామీని తుంగలో తొక్కడంతోపాటు రైతు సమస్యలపై ఢిల్లీలో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న ఆందోళనపైనా నిరంకుశంగా అణచివేతకు పాల్పడిందని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతోందని, మతఘర్షణలు సృష్టిస్తోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో బిజెపిని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాష్ట్రంలో బిజెపితో జతకట్టిన టిడిపి, జనసేనతోపాటు నిరంకుశ, ప్రజా వ్యతిరేక విధానాల అమలు చేస్తున్న వైసిపిని ఓడించాలని, ఇండియా బ్లాక్‌ పార్టీలను గెలిపించాలని కోరారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన నరేంద్ర మోడీతో కూటమి కట్టి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వైపు నడిపిస్తామని టిడిపి, జనసేన ఎలా చెబుతున్నాయని నిలదీశారు. బిజెపి పాలనలో రాష్ట్రానికి ఒరిగిన మేలేంటో చెప్పాలన్నారు. మద్యాన్ని నిషేధించాకే ఓట్లు అడుగుతామని గత ఎన్నికలప్పుడు చెప్పిన వైసిపి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతుందని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన ప్రతి ఒక్కర్నీ అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో సిపిఎం అనేక పోరాటం నిర్వహించిందని, రైతు, వ్యవసాయ కూలీలు, కార్మికుల సమస్యలపైన, ఇళ్ల పట్టాల కోసం చేనేత కార్మికుల సమస్యలపైన ఉద్యమించిందని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ ఫోరం బలపిచ్చే సిపిఎం, వామపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన మోడీని ప్రశ్నించాల్సింది పోయి కేసులకు బయపడి మోడీకి జగన్‌, చంద్రబాబు సలాం చేస్తున్నారని విమర్శించారు. రైతులు, ఇతర అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిత్యం పోరాడుతోందని, మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించడానికి కృషి చేసిందని వివరించారు. ప్రజల మధ్య ఉండి సమస్యలపై పోరాడే సిపిఎం, ఇతర వామపక్ష, ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, సీనియర్‌ నాయకులు పి.బాలకృష్ణ, మాట్లాడారు. టి.బ్రహ్మయ్య, జి.శ్రీనివాసరావు, నాగరాజు, ఎం.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు పాల్గొన్నారు.

➡️