బిజెపిది మేకపోతు గాంభీర్యమే : సిపిఎం

Apr 2,2024 23:21

మాట్లాడుతున్న రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు
ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ :
నల్ల ధనం వెలికితీసి ప్రజల ఖాతాల్లో జమ చేస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఇతర అనేక హామీలనిచ్చిన బిజెపి వాటిల్లో ఏ ఒక్కదాన్నీ అమలు చేయలేదని రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు అన్నారు. మండలంలోని నూతక్కిలో సిపిఎం విస్తృత సమావేశం నిర్వహించారు. మధు మాట్లాడుతూ బిజెపిది మేకపోతు గ్యాంభీర్యం మినహా దానికి దేశంలో ఎక్కడా సానుకూల పరిస్థితుల్లేవన్నారు. ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోవడానికి ఒక్కటీ లేదన్నారు. ఎలక్ట్రోరల్‌ బాండ్ల అవినీతిలో నిండా మునిగిన బిజెపి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల ఆలోచనలను మరల్చడానికి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ అరెస్టును తెరమీదకు తెచ్చిందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వని, విభజన హామీలు అమలు చేయని పార్టీకి రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు మద్దతివ్వడం సిగ్గు చేటన్నారు. ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ జాతీయ వనరులన్నింటిని కార్పొరేట్‌ సంస్థలకు కారు చౌకగా బిజెపి ప్రభుత్వం అమ్ముతోందని విమర్శించారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, దుగ్గరాజుపట్నం పోర్టు, కేంద్ర విద్యా సంస్థలు ఇవేవీ కూడా అమలు చేయకుండా అన్యాయం చేసిందని అన్నారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ చెంబుడు నీళ్లు పిడికెడు మట్టి ఇచ్చి ఆంధ్రప్రజల ఆత్మగౌరాన్ని దెబ్బతీశారని అన్నారు. బిజెపి పాలనలో ధరలు విపరీతంగా పెరిగి ప్రజల జీవనం దుర్భరమైందన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను మారుస్తున్నారని, కార్మికుల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. పంటలకు మద్దతు ధర కల్పిస్తామనే హామీనీ తుంగలోతోక్కారన్నారు. ఢిల్లీలో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతుల ఆందోళన చేస్తుంటే నిరంకుశంగా అణచివేయడానికి యత్నించిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, దేశ ఐక్యతకు భంగం కలిగే విధంగా మతఘర్షణలు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో బిజెపిని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి కూటమి కట్టిన టిడిపి, జనసేనను, నిరంకుశ వైపిపిని ఓడించి ఇండియా బ్లాక్‌ పార్టీల అభ్యర్థును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, నాయకులు కె.అజరు కుమార్‌, బి.జానారెడ్డి, వి.భారతి, సుబ్బారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, గోపి, సీత మహాలక్ష్మి, లాజరు పాల్గొన్నారు.

➡️