బ్రహ్మనాయుడుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు : జీవీ

Apr 1,2024 23:06

ప్రజాశక్తి – వినుకొండ : ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బూతునామాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామమని కూటమి తరుపున వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి సోమవారం విలేకర్లతో మాట్లాడారు. బ్రహ్మనాయుడు తరహాలో బూతులు తిట్టిన ఎమ్మెల్యే చరిత్రలో లేరన్నారు. అవినీతి చేసి రూ.కోట్లు సంపాదించడానికి బొల్లా ఎంచుకున్న దారులన్నీ మూసుకుపోతుంటే ఉక్రోషం పట్టలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. ఈ శునక గర్జనలతో ఏం సాధించాలని అనుకుంటున్నారో చెప్పాలన్నారు. గుండ్లకమ్మపై తంగిరాల డ్యామ్‌ నిర్మిస్తానని చెప్పి మోసం చేశారని, 14 కళాశాలలు తీసుకొస్తానని చెప్పి ఒక్కటీ తేలేదని, వినుకొండను పారిశ్రామికవాడను చెస్తామని చెప్పి ఒక్క పరిశ్రమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం గురించి ఎమ్మెల్యే ఎప్పుడైనా మాట్లాడారా? అని, నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఈ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. 6న వినుకొండలో జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ బొల్లా చేసిన అభివృద్ధి ఏమిటి? అరాచకాలెన్ని? అనే విషయంపై తాము ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఈ వయసులో అనవసరంగా బీపీ తెచ్చుకొని ఇబ్బంది పడవద్దని హితవు పలికారు. తనపై ఆరోపణలు చేస్తున్నారని, తప్పు చేసి ఉంటే కేసు పెట్టి జప్తు చేయించవచ్చు కదా? అని అన్నారు. 40 ఏళ్ల నుంచి చేపల చెరువులను లీజుకు తీసుకొని నడుపుతున్నా వివాదాలు రాలేదని, బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయ్యాక ఆ చెరువులను ఒక్కొక్కటిగా వదులుకుంటూ వచ్చామని చెప్పారు. తిరుమల డెయిరీకి తామంతా పాలుపోస్తే శాతాలు తగ్గించి మోసం చేశారని, లారీ డ్రైవర్‌గా, సినిమాలు వేసుకునే బొల్లా అపర కోటేశ్వర్లు ఎలా అయ్యారని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బొల్లాకి చెందిన వెయ్యి ఎకరాల్లో ఏముందో, తన 50 ఎకరాల్లో ఏముందో, ఆంజనేయులు 50 ఎకరాల్లో ఏముందో సర్వే జరుగుతుందని, అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ భూములేమైనా ఉన్నట్లు తేలితే పేదలకు పంచుతామని ప్రకటించారు. కార్యక్రమంలో జనసేన నియోజక సమన్వయకర్త కె.నాగశ్రీను రాయల్‌, టిడిపి నాయకులు పి.నాగేశ్వరరావు, షమీంఖాన్‌, పి.పూర్ణచంద్రరావు, బి.సైదులు పాల్గొన్నారు.

➡️