మరో మహిళా కూలీకి పాముకాటు

Feb 27,2024 00:17

ప్రజాశక్తి – మాచర్ల : మండంలోని అచ్చమ్మకుంట తండాకు చెందిన వ్యవసాయ కూలీ రమావత్‌ రంగీబాయి సోమవారం పొలంలో మిరపకాయలు కోసేందుకు వెళ్లి పాముకాటు గురయ్యారు. ఊరికి సుమారు కిలోమీటర్‌ దూరంలో ఉన్న పొలంలో పాముకాటుకు గురవుగా అక్కడినుంచి తోటి కూలీలు ఆమె తలపై రాయి పెట్టి ఇంటి వరకు నడిపించుకుని వచ్చారు. తలపై రాయేందుకు పెట్టారని బంధువులను అడగ్గా విషం, తలకెక్కకుండా ఉండేందుకు అలా చేశామన్నారు. ఐదున్నర సమయంలో పాముకాటుకు గురైతే ఎనిమిది గంటలకు ఆసుపత్రికి రావడం ఏంటని, ఇప్పటివరకు ఆసుపత్రికి ఎందుకు తీసుకురాలేదని అడగగా, పాము మంత్రం వేసే వారి దగ్గరికి వెళ్లామని, మంత్రం వేయించినా కాని, తగ్గకపోగా కాలువాసి విపరీతమైన నొప్పి వస్తున్నడంతో ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిపారు. రంగి బారుని పరిశీలించిన డాక్టర్‌ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటకు పంపించారు. మాచర్ల నియోజకవర్గంలో ఎక్కువ అటవీ ప్రాంతం ఉండడం, అటవీ ప్రాంతాన్ని అనుకొని వ్యవసాయ భూములు ఉండడంతో, తరచూ పాముకాట్లకి గురవుతున్నారు. వీరిలో కొందరు మరణిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే వెల్దుర్తి మండలం మొరుసపెంట తండాలో నల్గొండ ప్రాంతం నుండి మిరప కోతలకు వచ్చిన వలస కూలీ మహిళ పాము కరిచి మృతి చెందారు. పొలంలో మిరపకాయలు కోస్తుండగా చెట్ల మధ్యలో ఉన్న పాము కాటు వేయడం అక్కడనుండి మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే మహిళ చనిపోయారు. పాముకాటుకు గురైన వారిని వెంటనే ఆసుపత్రికి చేర్చాలన్న విషయంపై అధికారులు గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మాచర్ల ప్రభుత్వాస్పత్రికి అచ్చమ్మకుంట గ్రామానికి 20 కిలోమీటర్ల పైగా దూరం ఉండడం, రహదారి బాగుండకపోవడం కూడా కొంత ఆలస్యానికి కారణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

➡️