మాదకద్రవ్యాల కంటే ప్రమాదకరంగా డిజిటల్‌ వ్యసనం

Feb 12,2024 00:37

ప్రజాశక్తి – ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగం, స్పందన ఈదా ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్లు ‘డిజిటల్‌ టెక్నాలజీ యూత్‌ మెంటల్‌ హెల్త్‌’ అంశంపై సంయుక్తంగా నిర్వహించిన మూడ్రోజుల అంతర్జాతీయ సదస్సు ఆదివారంతో ముగిసింది. 8 సెషన్లలో వంద పరిశోధన పత్రాలు, రాగ వాటిల్లో 40 పరిశోధన పత్రాలు చర్చకు వచ్చాయి. వీటిల్లో 18 పరిశోధన పత్రాలు విదేశీయులు సమర్పించారు. యువత, చిన్న పిల్లలు మొబైల్‌ వాడే వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత మార్పులకు అనుగుణంగా ఎదగాలని, డిజిటల్‌ వినియోగం అవసరం మేరకే సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సహజంగా మానవ శరీరానికి డ్రగ్స్‌ మాదకద్రవ్యాలు ఎంత ప్రమాదకరమో అంతకుమించి డిజిటల్‌ వినియోగం చెడు ప్రభావాలను చూపిస్తున్నట్లు సదస్సులో పలు పరిశోధన పత్రాలు ప్రచురించారు. చిన్నపిల్లల్లో మొబైల్‌కు బానిసలుగా మారే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉందని, ఇది కుటుంబంలో తల్లిదండ్రులకు మానసిక రుగ్మతలు వచ్చేందుకు కారణమవుతోందని, మొబైల్‌ వాడకండి నిలిపివేస్తే చిన్నపిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందనేది స్పష్టంగా ఉదాహరణలతో పరిశోధన పత్రాలు వచ్చాయి. నేటి రోజుల్లో చిన్నపిల్లలు మొబైల్‌ ఉంటేనే భోజనం చేయటం, హోంవర్క్‌ చేయటం పరిపాటిగా మారింది. ఆ వ్యసనాల నుంచి వారిని దూరం పెట్టే క్రమం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. ఇటువంటి అంతర్జాతీయ సదస్సుల ద్వారా మేధావులు, పరిశోధకులు శాస్త్రీయ అధ్యయనాలు జరిపి సమాజ పురాభివద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సదస్సు డైరెక్టర్‌ డాక్టర్‌ బట్టు నాగరాజు, స్పందన ఈద ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ శామ్యూల్‌రెడ్డి, డైరెక్టర్‌ అంజిరెడ్డి, కన్వీనర్‌ డాక్టర్‌ టిడి విమల, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం.వసంతరావు, సైకాలజీ విభాగం అధ్యాపకులు కృష్ణమోహన్‌, డాక్టర్‌ చంద్రిక, అంబేద్కర్‌ చైర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అబ్రహం లింకన్‌, సైకాలజీ విభాగం బీవోఎస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️