మిమ్స్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Feb 21,2024 20:57

 ప్రజాశక్తి-నెల్లిమర్ల  : మిమ్స్‌ యాజమాన్యం మొండి వైఖరి వీడి ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ హెచ్చరించారు. గురువారం స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు చేస్తున్న పోరాటం 21వ రోజుకి చేరుకుంది. ఈ సందర్బంగా సురేష్‌ మాట్లాడుతూ డిఎ బకాయిలు చెల్లించాలని, వేతన ఒప్పందం చేయాలని, సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ చేస్తున్న న్యాయమైన పోరాటానికి జిల్లా కార్మికులు, ప్రజల మద్దతు ఉందని తెలిపారు. అంతే కాకుండా మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు కోవిడ్‌ సమయంలో ప్రాణాలకుతెగించి ప్రజలకు సేవలు అందించారని, హాస్పిటల్‌ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఇలాంటి ఉద్యోగులకు న్యాయం చేయకుండా మిమ్స్‌ యాజమాన్యం చట్టాన్ని దిక్కరించి 7 డిఎలు బకాయిలు ఉంచడం, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయక పోవడం, 21రోజులు అయినా నేటికి జనవరి నెల జీతం వెయ్యకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా మిమ్స్‌ యాజమాన్యం మొండి వైఖరి విడి చర్చలకు వచ్చి ఉ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టివి రమణ, జిల్లా కమిటీ సభ్యులు కిల్లంపల్లి రామారావు, ఉద్యోగులు మిరప నారాయణ,కర్రోతు కాము నాయుడు, మహంతి నాగభూషణం, మధు, మూర్తి, రాంబాబు, గౌరీ, వరలక్ష్మి, రామకృష్ణ, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️