మిమ్స్‌ మొండివైఖరి

Feb 9,2024 20:06

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  దురాశ దు:ఖానికి చేటు అంటారు పెద్దలు. దీనికి నిరంకుశత్వం తోడైతే ఎలా ఉంటుందో వేరేగా చెప్పనక్కర్లేదు. నెల్లిమర్ల మిమ్స్‌ (మహారాజా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌) లో అచ్చంగా అదే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను యాజమాన్యం లోబరుచుకుని, వారికోసం నిరంతరం పోరాడుతున్న సిఐటియును విచ్ఛిన్నం చేసింది. నాలుగేళ్లగా శ్రమ, సీనియార్టీకి తగ్గ వేతనాలు ఇవ్వకపోవడంతోపాటు మునుపుటి మాదిరిగా డిఎలు చెల్లించకపోవడం, వేధింపులకు గురిచేయడం, ప్రశ్నించినవారిపై సస్పెన్షలతో బెదిరింపు చర్యలకు పాల్పడడంతో ఉద్యోగులు తిరిగి సిఐటియును ఆశ్రయించారు. సాధించిన హక్కులను సైతం యాజమాన్యం కాలరాస్తుండడంతో ఈనెల 1వ తేదీనుంచీ విధులు బహిష్కరించారు. దీంతో, మిమ్స్‌ ఆసుపత్రి మొత్తం ఖాళీ అయ్యింది. అటు రోగులు, ఇటు ఉద్యోగులు లేక వెలవెలబోతోంది. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినా పరిష్కారానికి చొరవ చూపలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2003లో ఏర్పాటైన మిమ్స్‌ ఆసుపత్రిలో సుమారు 1000 పడకలు ఉన్నాయి. జిల్లాలో గత ఏడాది వరకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అంటూ లేకపోవడంతో కొన్ని సేవలకు మిమ్స్‌ గత్యంతరంగా ఉంది. ఈనేపథ్యంలో ఇప్పటికీ రోజూ వేలాది మంది ఔట్‌పేషెంట్లు, వందలాది మంది ఇన్‌పేషెంట్లు వస్తుంటారు. మరోవైపు విద్యార్థుల నుంచి కోట్ల రూపాయలు ఫీజులు వసూలు చేస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా అందులోని పెద్దల సహకారం మిమ్స్‌ యాజమాన్యానికి ఉండడం వల్ల ఇన్నాళ్లూ జిల్లాకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అంటూ రాకుండా పోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ సంగతి కాస్త అటుంచితే మెడికల్‌ కాలేజీ, భోదనాసుపత్రిలో నర్సులు, ఎన్‌ఎంలు, ఆయాలు, వార్డు బార్సుతోపాటు ఎలక్ట్రికల్‌, పబ్లింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, ల్యాబొరేటరీ, సెక్యూరిటీ తదితర విభాగాల్లో సుమారు 500మంది పనిచేస్తున్నారు. వీరంతా ఏళ్ల తరబడి చాకిరీ చేస్తున్నా వేతనాల పెంపు, నెలవారీ సెలవులు, డిఎ సదుపాయం, వేతన సవరణ అంటూ ఉండేవి కాదు. దీనికి తోడు యాజమాన్యం నిరంకుశ వైఖరితో ఉద్యోగులు కూడా సంఘటితంగా ఉండలేని దుస్థితి ఉండేది. ఇంకా చెప్పాలంటే ఉద్యోగులు, ఒకరి ఇబ్బందులు మరొకరికి చెప్పుకోలేని పరిస్థితి ఉండేది. ఇదంంతా 2011 సంవత్సరం నాటి ముందు మాట. అప్పటి వరకు పుట్టెడు దుఖంతో యాజమాన్యం వద్ద నలిగిపోతున్న ఉద్యోగులు అదే సంవత్సరం ఫిబ్రవరిలో సిఐటియును ఆశ్రయించారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని నాయకత్వానికి వివరించారు. సిఐటియు కార్మికులను ఐక్యం చేసింది. మిమ్స్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏర్పాటు చేసింది. మిమ్స్‌లోని 90శాతం ఉద్యోగులు సభ్యులుగా చేరారు. దీంతో, దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తూ అప్పటి వరకు ఏకపక్ష వైఖరితో ఉన్న మిమ్స్‌ యాజమాన్యం మెడలు వంచింది. కార్మికుల ఐక్యత, సిఐటియు పోరాటాల ముందు యాజమాన్యం పాచికపారలేదు. దిగివచ్చిన యాజమాన్యం 2011లోనే రెండేళ్ల వేతన ఒప్పందానికి ముందుకు వచ్చింది. ఆ తరువాత 2013, 2015, 2017 సంవత్సరాల్లో క్రమం తప్పకుండా వేతన ఒప్పందాలు జరిగాయి. 2011 అక్టోబర్‌ నుంచి 2020 అక్టోబర్‌ వరకు క్రమం తప్పకుండా డిఎ పెరింగింది. ఇందుకు తగ్గట్టే ఉద్యోగులు యాజమాన్యానికి సహకరించారు. 2019 – కోవిడ్‌ సందర్భంగా ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందించారు. ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడి ఉద్యోగుల అంకితభావం అటు కాలేజీ, ఇటు బోధనాసుపత్రి ప్రతిష్ట పెంచింది. అయినా కార్మికులకు చెల్లిస్తున్న జీతభత్యాలు, ఇతర సదుపాయాల పట్ల మాత్రం కంటగింపుగా మారింది.లాభాపేక్షలో పడ్డ యాజమాన్యం 2019లో చేయాల్సిన వేతన ఒప్పందానికి ముందుకు రాలేదు. ఇతర సదుపాయాల విషయంలో మీనమేషాలు లెక్కించింది. దీంతో, సిఐటియు నాయకత్వంలో కార్మికులు గట్టిపోరాటాలే నిర్వహించారు. దీంతో, ఎలాగైనా కార్మికల ఐక్యతను దెబ్బతీయాలని భావించిన యాజమాన్యం కొంతమందిని లోబరుచుకుంది. మాయమాటలతో కార్మికులను బురిడీకొట్టించి సిఐటియు మైనార్టీలో పడేలా చేసింది. ఇదే అదునుగా భావించి యాజమాన్యం డిఎలను నిలిపివేసింది. ఇతర సదుపాయాలనూ క్రమంగా రద్దుచేసింది. యాజమాన్యం మాయయాటలకు అప్పటికే అసంఘటితంగా మారిన కార్మికులు అన్యాయాన్ని ఎదురించలేని పరిస్థితి ఏర్పడింది.

2021 నుంచి పనిలో చిన్నపాటి పొరపాట్లు జరిగినా జరిమానాలు విధించడం లేదా వేతనాల నుంచి కోత విధించడం వంటి దుర్మార్గ చర్యలకు దిగింది. చివరకు బలవంతపు అంగీకార లెటర్లు రాయించడం వరకు వెళ్లింది. ఇటీవల కాలంలో వేధింపులు ముమ్మరం చేయడంతోపాటు చిన్నపాటి పొరపాట్లను సాకుగా చూపి పలువురిని సస్పెండ్‌ చేసింది. దీంతో, యాజమాన్యం నిజస్వరూపం తెలుసుకున్న కార్మికులు తిరిగి సిఐటియును ఆశ్రయించారు. తమపక్షాన యాజమాన్యంతో పోరాడాలని, వేతన సవరణ చేయడం లేదని, ఏడుసార్లు డిఎ పెంచాల్సి ఉందని, వేధింపులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని చెప్పడంతో సిఐటియు మరోసారి పోరాటానికి దిగింది. పలుమార్లు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా సానుకూల వైఖరి లేకపోవడంతో సిఐటియు నాయకత్వంలో ఈనెల 1వ తేదీ నుంచీ కార్మికులు విధులు బహిష్కరించి, ఆసుపత్రి ఎదుటే నిరసన దీక్ష చేపట్టారు. ఈనెల 5న కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌కు తమ సమస్యను విన్నవించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈనెల 7వ తేదీన కార్మిక శాఖ డిప్యూటీ కమిషర్‌ (డిసిఎల్‌) చర్చలు ఏర్పాటు చేసినప్పటికీ సిఐటియు నాయకులతో చర్చించేందుకు యాజమాన్యం నిరాకరించింది. దీంతో, సిఐటియు నాయకులు లేకుండా తాము కూడా చర్చలకు వచ్చేది లేదంటూ కార్మికులు కూడా ఖరాఖండిగా తేల్చిచెప్పారు. దీంతో, విశాఖలోని కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ సమక్షంలో చర్చలు వెళ్లాలని డిసిఎల్‌ సూచించారు. యాజమాన్యం మొండివైఖరి వీడకపోతే విధుల్లో చేరేది లేదని కార్మికులు, సిఐటియు నాయకులు చెబుతున్నారు.

➡️