మిమ్స్‌ యాజమాన్యం ఉద్యోగుల హక్కులు కాలరాయడం తగదు

Feb 10,2024 21:40

 ప్రజాశక్తి-నెల్లిమర్ల  : మిమ్స్‌ యాజమాన్యం ఉద్యోగులు, కార్మికులు హక్కులు కాలరాయడం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసన శిబిరాన్ని వెంకటేశ్వర రావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం సమస్యలు పరిష్కరించాలని కోరితే సస్పెండ్‌, బ్లాక్‌ మెయిల్‌ చేయడం వంటి కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని అన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు,కార్మికులు లేకపోతే మిమ్స్‌ అనేది లేదని, అన్ని వర్గాల సహకారంతో మిమ్స్‌ నడుస్తుందని తెలుసుకోవాలని హితవు పలికారు. మిమ్స్‌ యాజమాన్యం 7 డిఎలు చెల్లించలేదు సరికదా 4ఏళ్ల నుంచి వేతన ఒప్పందం చేయకపోవడం దుర్మార్గమన్నారు. యాజమాన్యం మొండి వైఖరితో ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు పడుతుంటే కార్మికశాఖ ఏం చేస్తుందని ప్రశ్నించారు. కార్మిక చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత వారికి లేదా అని ప్రశ్నించారు. కార్మికశాఖ యాజమాన్యం వైపు ఉందో? కార్మికుల వైపు ఉందో తేల్చుకోవాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం మొండి పట్టుదల వీడి ఉద్యోగులు, కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించి మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. శిబిరాన్ని ఎస్‌ ఎఫ్‌ఐ రాష్ట్రఉపాధ్యక్షులు పి.రామ్మోహన్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్‌ వెంకటేష్‌,డి.రాము, కెవిపిఎస్‌ నాయకులు ఆర్‌. ఆనంద్‌ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. శిబిరంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్య నారాయణ, మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ, సిఐటి యు నాయకులు కిల్లంపల్లి రామారావు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

➡️