మిమ్స్‌ యాజమాన్యం మొండి వైఖరి వీడాలి

Feb 13,2024 20:51

ప్రజాశక్తి – నెల్లిమర్ల: మిమ్స్‌ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌. నర్సింగరావు డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని గత 13రోజులుగా చేస్తున్న నిరశన శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిమ్స్‌ యాజ మాన్యం గత మూడు సంవత్సరాలుగా చేస్తున్న కక్ష సాధింపు చర్యలు, వేధింపులు, దుర్మార్గాలకు విసిగి వేసారి పోయి ఉద్యోగు లు, కార్మికులు సిఐటియుని ఆశ్రయించారన్నారు. ముఖ్యంగా సిఐటియుకి రెచ్చగొట్టే అవసరంలేదని ఉద్యోగులు, కార్మికులు సిఐటియు తలుపు తడితే వచ్చారని మిమ్స్‌ యాజమాన్యం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సిఐటియుని ఉద్యోగులు, కార్మికులు వద్దంటే వెళ్ళిపోతుంది గాని మిమ్స్‌ యాజమాన్యం వెళ్ళిపొమ్మని, రమ్మని చెబితే కుదరదని హెచ్చరించారు. కాబట్టి యాజమాన్యం వెంటనే స్పందించి ఉద్యోగులు, కార్మికుల సమ స్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యమంలో బాగంగా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మిమ్స్‌ యాజమాన్య భాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిలో భాగంగా ఈ నెల 14న జిల్లాలోని అన్ని ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలను కూడ గట్టి ఎన్‌పిఆర్‌ భవనంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామని 19న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్య నారాయణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్షులు పి. శంకర రావు, కె.సురేశ్‌, జిల్లా నాయకులు వి .రాములు, టివి రమణ, ఎ. జగన్‌ మోహన్‌ రావు, జి. అప్పల సూరి పాల్గొన్నారు.

➡️