ముగిసిన కొండవీడు ఫెస్ట్‌

Feb 12,2024 00:30

హెలీరైడ్‌లో మంత్రి విడదల రజిని, పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌
ప్రజాశక్తి – యడ్లపాడు, చిలకలూరిపేట :
యడ్లపాడు మండలంలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న ఫెస్ట్‌ నేపథ్యంలో ఆదివారం కొండవీడు కోటకు పర్యాలకులు పోటెత్తారు. ఉత్సవాలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఉదయం రెండోరోజు ఫెస్ట్‌ కార్యక్రమాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రారంభించారు. తొలుత కొండవీడు ముఖద్వారం నుండి నిర్మాణంలో వున్న అతిథి గృహం దేవాలయాల సముదాయం వరకు రూ.5 కోట్లతో విస్తరించిన ఘాట్‌ రోడ్‌ను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌తో కలిసి మంత్రి రజిని ప్రారంభించారు. అనంతరం హెలీరైడ్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా వసంత రాజీయం వేదిక దగ్గరకు చేరుకొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. పక్కనే ఉన్న రాక్‌ క్లైమ్బింగ్‌, ఫ్లవర్‌ షో, సైకత శిల్ప ప్రదర్శన కొండవీటి కోట ప్రాకారం, ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు, అక్కడనుండి ప్రసిద్ది చెందిన ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ల పేర్లు కలిగిన మూడు చెరువులను సందర్శించారు, వెదుళ్ల చెరువులో బోట్‌ షికారులు చేశారు. పారా మెడికల్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, హార్స్‌ రైడింగ్‌, ఫొటో ఎగ్జిబిషన్‌, కీయా కింగ్‌ బోటింగ్‌, చిల్డ్రన్స్‌ ప్లే ఎగ్జిబిషన్‌లో సందర్శకులతో కలిసి సందడి చేశారు. సందర్శకులకు ఫుడ్‌ కోర్టులు, డి.ఆర్‌.డి.ఏ సంఘం తరఫున మహిళా సంఘాలు రకరకాల చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను అందజేశారు. మాంసాహార ప్రియులకు వైజాగ్‌ నుంచి అద్భుతమైన వంటకాలను తీసుకువచ్చి వడ్డించారు. అనంతరం వేదికపై క్లాసికల్‌ డాన్స్‌, వెస్ట్రన్‌ డాన్స్‌ ప్రదర్శనలిచ్చారు. వీరికి అతిథులు బహుమతులు అందజేశారు. జబర్దస్త్‌ టీమ్‌ సమీర్‌ భరద్వాజ్‌, మురళి పాటలను ఆలపించారు, జబర్దస్త్‌ టీం నుంచి రైజింగ్‌ రాజు, తన్మయి, రాజమౌళి, శాంత కుమార్‌ స్కిట్లను, నృత్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ టి.కృష్ణబాబు, ఎలక్షన్‌ కమిషన్‌ అసిస్టెంట్‌ అధికారి కోటేశ్వరరావు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.నేడూ కొనసాగనున్న హెలికాప్టర్‌ రైడ్‌ కొండవీడు ఫెస్ట్‌కు విశేష స్పందన లభించడంతోపాటు హెలికాప్టర్‌రైడ్‌కు ఆదరణ లభించిందని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్‌ రైడ్‌ సోమవారమూ కొనసాగిస్తామని తెలిపారు. బుకింగ్‌ కోసం మహేష్‌-7483432752, 94003 99999 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

➡️