మోసం చేసిన బిజెపిపై పోరాటం

Feb 13,2024 23:28

ప్రచారంలో మాట్లాడుతున్న వి.కృష్ణయ్య
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రజలంతా పోరాడాలకు సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఈనెల 16న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక బంద్‌ జయప్రదం కోసం నియోజకవర్గంలోని నాదెండ్ల, అప్పాపురం, ఏలూరు, మానుకొండ వారి పాలెం, పసుమర్తి, తాతపూడి, మురికిపూడి గోపాల వారి పాలెం, కావూరు లింగంగుంట్ల, ఎండుగంపాలెం తదితర గ్రామాల్లో మంగళవారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ పంటలకు మద్దతు ధరలివ్వాలని, కార్మికులకు కనీస వేతనం రూప26 వేలు అమలు చేయాలని కోరారు. ఉపాధి హామీ పనులను ఏడాదిలో 200 కల్పించడంతోపాటు రోజు వేతనం రూ.600 చెల్లించాలన్నారు. కౌలు రైతులకు భూ యజమనితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలన్నారు. కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల ప్రకారం అన్ని పంటలకు సీటు 2 ప్లస్‌ 50శాతం ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలన్నారు. కేరళ తరహా రుణ ఉపశమన చట్టం చేయాలన్నారు. కార్మిక వాడలుగా ప్రసిద్ధి చెందిన గణపవరం తదితర ప్రాంతాల్లో పరిశ్రమలన్నీ మూసివేతకు గురవుతున్నాయని, అయినా ప్రభుత్వాలకు పట్టడం లేదని విమర్శించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారాలు వేయడం మినహా సాధించిందేమీ లేదన్నారు. కార్పోరేట్లకు దేశ సంపదను దోసచి పెడుతున్నారన్నారు. అవినీతిని రూపుమాపడం, నల్లడబ్బు జనం ఖాతాల్లో వేయడం, ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు తదితర హామీలతో ప్రజల్ని బిజెపి మోసం చేసిందని మండిపడ్డారు. వీటి నుండి జనం దృష్టి మరల్చేందుకు మతం పేరుతో మంటలు పెడుతున్నారన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రజలంతా కలిసి రావాలని కోరారు. ప్రచారంలో నాయకులు టి.బాబురావు, ఎస్‌.లూథర్‌, టి.ప్రతాపరెడ్డి, పి.వెంకటేశ్వర్లు, ఎం.విల్సన్‌, డి.వరహాలు పాల్గొన్నారు.

➡️