యార్డుకు పోటెత్తిన మిర్చి

Feb 13,2024 23:30

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు మిర్చి యార్డుకు మంగళవారం రైతులు టిక్కీలను భారీగా తీసుకువచ్చారు. సీజన్‌ ప్రారంభమైన తర్వాత గత రెండు రోజులనుంచి యార్డుకు టిక్కీల తాకిడి పెరిగింది. యార్డుకు ఒకే రోజు లక్షన్నర టిక్కీలు రావడంతో గుంటూరు- చిలకలూరిపేట-సత్తెనపల్లి మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. పెద్ద ఎత్తున లారీలు, ట్రాక్టర్లలో మిర్చి టిక్కీలు తరలివస్తున్నాయి. మిర్చి యార్డుకు కిలో మీటరు దూరం వరకు ఎటుచూసినా ఈ వాహనాలతోనే రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. కర్నూలు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి ఎక్కువగా సరకు వస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి మంగళవారం 1,49,013 టిక్కీలు రాగా పాత నిల్వలతో కలిపి 1,39,129 టిక్కీలు అమ్ముడుపోయాయి. ఇంకా 1,01,807 టిక్కీలు నిల్వ ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ సరుకు రావడంతో మంగళవారం యార్డు కిటికిటలాడింది. ధరల ఆశించినంత లేకపోవడం వల్లరైతులు నిరాశకు గురయ్యారు. గతేడాది ఇద ేరోజుల్లో గరిష్ట ధర రూ.25 వేల వరకు పలికింది. గత 10 రోజుల్లో క్వింటాళ్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు తగ్గింది. సరుకు ఎక్కువగా వస్తుండటంతో వ్యాపారులు ధరలను క్రమంగా తగ్గిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం గృహ అవసరాల కోసం ఎక్కువగా వ్యాపారులు మిర్చి కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజీలకు తరలిస్తున్నారు. మరో 20 రోజుల్లో పచ్చళ్లసీజన్‌ ప్రారంభం అవుతుండటంతో రిటైల్‌లో మిర్చికి గిరాకి పెరిగింది. మరో రెండునెలల్లో మామిడి కాయలు రానున్న నేపథ్యంలో గృహ అవసరాలకు వినియోగదారుల నుంచి మిర్చి కొనుగోలుకు అవకాశం ఉండటంతో కొత్తసరుకు డిమాండ్‌ పెరిగింది. ఈ ఏడాది వర్షాభావం వల్ల దిగుబడి కూడా తగ్గుతుందనే అంచనాల నేపథ్యంలో రైతులనుంచి సరుకు కొనుగోలుకు వ్యాపారులు ముందుకు వస్తున్నారు. అయితే ధరలను మాత్రం ఆశించిన స్థాయిలో పెంచడంలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వారం కంటే ఈ వారం ధరలు ఏమాత్రమూ పెరగడలేదు. సాధారణ రకాలు ధర క్వింటాళ్‌ కనిష్ట ధర రూ.8 వేలు, గరిష్ట ధర రూ.20,500 పలికింది. మేలు రకాల సరుకు కూడా ధరలు తక్కువగానే నమోదయ్యాయి. ప్రధానంగా తేజ,బాడిగ రకాలు కనిష్ట ధర క్వింటాలు రూ.8వేలు, గరిష్ట సగటు ధర రూ.21,500 పలికింది. సాధారణరకాల్లో కామన్‌ వెరైటీ 334 రకం కనిష్టంగా రూ.8 వేలు, గరిష్టంగా 20,500, నెంబరు 5 కనిష్టంగా 9 వేలు, గరిష్టంగా రూ.20 వేలు, 273 రకం రూ.13,500 నుండి రూ.20,500, 341 రకం రూ.10 వేలు, 21,500, 4884 రకం రూ.13 వేలు, రూ.18 వేలు, సూపర్‌-10 రూ.13,500 నుండి రూ.17300 ధరలు వచ్చాయి. నాన్‌ ఎసి స్పెషల్‌ వెరైటీల్లో తేజ కనిష్టంగా రూ.8వేలు. గరిష్టంగా రూ.21, 500, బాడిగ కనిష్ట ధర రూ.10 వేలు, రూ.21,000, దేవనూరుడీలక్స్‌ రూ.11 వేల నుండి రూ.20 వేలు ధర పలికాయి.

➡️