రక్తహీనత నివారణకు చర్యలు : డిఎంఒ

Feb 12,2024 21:05

 ప్రజాశక్తి – గరుగుబిల్లి : రక్తహీనతను నివారించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు అన్నారు. ఉద్ధవోలులో ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వైద్య సేవలు, రికార్డులు పరిశీలించి వారి ఆరోగ్య సమస్యలు, అందజేసిన చికిత్సను తెలుసుకున్నారు. కొత్తగా గుర్తించిన దీర్ఘకాలిక రోగులను పర్యవేక్షించాలని అన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎక్కువగా రక్తహీనతపై దృష్టి సారించాలని గర్భిణీలకు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికల్లో హీమోగ్లోబిన్‌ శాతం తక్కువగా గుర్తించిన వారికి నిర్దేశించిన చికిత్స అందజేస్తూ రక్తశాతం వృద్ధి చెందే వరకు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే అవసరమైన వారికి సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు జరపాలన్నారు.104 వాహనంలో మందులు,వైద్య పరికరాలు తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలో మంచానికి పరిమితమైన వృద్ధురాలి గృహ సందర్శన చేసి ఆరోగ్య పరిశీలన చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ కెకె.సాగర్‌ వర్మ, హెల్త్‌ సూపర్‌ వైజర్‌ ఉదయ కుమారి, వైద్య సిబ్బంది మౌనిక, ఈశ్వరి, 104 సిబ్బంది దుర్గాప్రసాద్‌, రవి, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

➡️