రబీలో గణనీయంగాతగ్గిన వేరుశనగ దిగుబడి

ప్రజాశక్తి – సింహాద్రిపురంఈ ఏడాది రబీ సీజన్‌లో బోరు బావుల కింద సాగు చేసిన వేరు శనగ దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందో ళన చెందుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో రైతులు అధిక దిగుబనిచ్చే 1812, కదిరి లేపాక్షి, 1694, ట్యాగ్‌, గిరినార్‌-4 రకాల విత్తనాలను సాగు చేశారు. ఈ విత్తనాలకు సంబంధించి దాదాపు నాలుగు నెలల 20 రోజుల అనంతరం పంట దిగుబడి చేతికొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది పంట సాగు చేసినప్పటి నుంచి వర్షం కురువకపోవడంతో పంట దిగుబడి తగ్గిందని రైతులు చెబు తున్నారు. మండల వ్యాప్తంగా 1,320 ఎకరాలలో ఏడాది పంటను సాగు చేశారు. ఎకరాకు రూ30 నుంచి రూ.40 వేలు పెట్టుబడులు అయ్యాయని రైతు లు చెబుతున్నారు. ఎకరాకు కేవలం 10 నుంచి 15 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రబీ సీజన్‌లో సాగు చేసే వేరుశనగకు ఆధునిక వంగడాలైన ఈ రకాలు విత్తనం వేస్తే ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు దిగుబడి రావాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.కొనుగోలుకు ముందుకు రాని ప్రభుత్వం.. గతంలో రబీ సీజన్‌లో సాగుచేసిన వేరుశనగ పంట ఉత్పత్తులను ప్రభుత్వం మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్దతు కోసం కొనుగోలు చేసేది. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. దీంతో దళారులు ఆడింది ఆట.. పాడింది పాటగా ఉంది. ధరలను అమాంతంగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. 43 కిలోల బస్తా నాణ్యత, పరిమాణం ఆధారంగా రూ.2000 నుంచి రూ.2600 వరకు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ధర వేరుశెనగకు రూ.6,350 ఉంది. అయితే నాణ్యత, పరిమాణం పేరుతో వ్యాపారస్తులు ధరలను అమాంతంగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రభుత్వ మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.వేరుశనగ సాగు గిట్టుబాటు కావడం లేదు..ప్రస్తుతం వేరుశనగ సాగు గిట్టుబాటు కావడం లేదు. విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, కూలీల ఖర్చు భారీగా పెరిగాయి. ఎకరాకు రూ.40 వేలు వరకు పెట్టుబడి వచ్చింది. ఈ కారణంగా ఎకరాకు 10 నుంచి 15 బస్తాలు దిగుబడులు వస్తే నష్టం వస్తోంది. కావున ప్రభుత్వం స్పందించి సాగు చేసిన రైతులకు పరిహారం అందించాలి.- చంద్రమౌళి, రైతు, సుంకేసుల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా..ఈ ఏడాది రబి సీజన్‌లో సాగు చేసిన పంటల దిగుబడి వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. వేరుశెనగ దిగుబడులు తగ్గినట్లు మా దృష్టికి వచ్చింది. దిగుబడి పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు వివరిస్తా.- శివమోహన్‌ రెడ్డి, ఎఒ, సింహాద్రిపురం

➡️