రవాణారంగ సమస్యలపై 13న రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Feb 11,2024 20:06

 ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  : రవాణా రంగ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ఈనెల 13న ఉదయం 10:30 గంటలకు కెఎల్‌పురం ఎన్‌పిఆర్‌ భవన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) జిల్లా కన్వీనర్‌ ఎ.జగన్మోహన్‌రావు, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వి. రాములు తెలిపారు. ఈమేరకు ఆదివారం పోస్టర్‌ విడుదల చేశారు. సరుకు, ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ట్రాన్స్‌పోర్టు యాజమాన్యాలు, డ్రైవర్ల, వర్కర్ల సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్‌ ,డీజిల్‌ ధరలు మండిపోతుంటే, రోడ్‌ టాక్స్‌లు, చలనాలు, టోల్‌ ఛార్జీలు, ఫీజులు, పెనాల్టీలు పెంచి నడ్డి విరుస్తున్నారన్నారు. రవాణా రంగ కార్మికుల రక్షణ కోసం సంక్షేమ చట్టం చేయాలని, ఎంవి యాక్ట్‌ 2020 లో ప్రమాదకరమైన అంశాలను రద్దు చేయాలని ఫిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతుందని, ఈ సమ్మె విజయవంతానికి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. లారీ ,ఆటో, క్యాబ్‌ ,లగేజ్‌ వెహికల్స్‌, ఆర్‌టిసి, అద్దె బస్సు తదితర ట్రాన్స్‌పోర్టు ఓనర్‌ కమ్‌ డ్రైవర్లు, వర్కర్లంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

➡️