రాజన్నదొర నోట ఎమ్‌పి మాట

Feb 25,2024 21:31

ప్రజాశక్తి – సాలూరు : డిప్యూటీ సిఎం రాజన్నదొర నోటి వెంట మళ్లీ ఎంపీ సీటు మాట తెరపైకి రావడం పార్టీ శ్రేణుల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. గత కొంతకాలంగా ఆయన అప్పుడప్పుడు కాకతాళీయంగా ఎంపి కావాలన్న కోరికను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. అయితే ఎంపిగా పోటీ చేయాలనే కోరిక మాత్రం ఆయన మనసులో బలంగా ఉంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన డిప్యూటీ సిఎం స్థాయి వరకు ఎదిగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపిగా పోటీ చేయడమే మంచిదనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తన వ్యక్తిగత సమస్యలతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. గతకొద్ది నెలలుగా ఆయన కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించలేనేమోనన్న భయం వెంటాడుతోంది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తల మధ్య అభిప్రాయబేధాలను పరిష్కరించాల్సి వుంటుంది. ఎన్నికల ముందు కొంతమంది నాయకులు బెదిరింపులు, అదిరింపులకు దిగే అవకాశం ఉంది. అలాంటి వారిని బుజ్జగించి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాలంటే వందశాతం ఆరోగ్యంగా ఉండాలనేది ఆయన అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ, మండల స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టి ఒత్తిళ్లకు గురై ఎమ్మెల్యేగా పోటీ చేయడం కన్నా ఎంపీగా పోటీ చేస్తే వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి కొంత సమయం దొరుకుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం ఆయన ఎంపిగా పోటీ చేయాలనే కోరికను బయటపెట్టారు. మండల వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఎంపీగా పోటీ చేయాలనే అభిప్రాయాన్ని ఉద్దేశపూర్వకంగానే చెప్పినట్లు అనిపించింది. సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ఎంపిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే అధిస్థానం దేనికి పోటీ చేయమంటే దానికి చేస్తానని కూడా చెప్పారు. అరుకు ఎంపి నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఆరు ఎస్టీ, ఒక ఎస్సీ నియోజకవర్గం ఉండడంతో విజయం సునాయాసమవుతుందనే అభిప్రాయం ఆశావహుల్లో ఉంది. టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా ఈ సారి అరుకు ఎంపీ సీటును బిజెపి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వైసిపి ఎంపి అభ్యర్థిగా పోటీ గెలిచిన మాజీ ఎంపి కొత్తపల్లి గీత ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. ఆమె 2014లో వైసిపి ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న కొత్తపల్లి గీత ఎంపీగా పోటీ చేయాలనే యోచనలో వున్నారు. టిడిపి, బిజెపి రాష్ట్ర నాయకులతో ఆమెకు సత్సంబంధాలు ఉండడంతో ఎంపి సీటు ఆమెకు దక్కుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసిపి ఎంపి అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా గెలుపు సునాయాసమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిలో భాగంగానే రాజన్నదొర ఎంపి పల్లవి అందుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎంపిగా పోటీ చేసి గెలిస్తే వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి సమయం దొరుకుతుందని, ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందనే ఆలోచనతో రాజన్నదొర ఉన్నట్లు సమాచారం. ఆయన నోటి వెంట మళ్లీ ఎంపీ మాట రావడం వెనుక వ్యూహాత్మక అడుగులతో పాటు ఉద్దేశపూర్వకమైన అభిప్రాయం కూడా వుందని స్పష్టమవుతోంది.దొర ఎంపిగా వెళ్తే ఎమ్మెల్యే ఎవరో?ఒకవేళ అరుకు ఎంపి అభ్యర్థిగా డిప్యూటీ సిఎం రాజన్నదొరను ఎంపిక చేస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి ఎంపి సీటు రేసులో జిసిసి చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభా స్వాతీరాణి ఉన్నారు. మొదటి నుంచి ఎంపి టికెట్‌ కావాలని ఆమె ఆశిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఎంపి అభ్యర్థిగా పాడేరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని పార్టీ ప్రకటించింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భాగ్యలక్ష్మిని తప్పించి వేరొకరికి సీటు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి సీటు ఆశిస్తున్న ఎస్టీ భగత సామాజిక వర్గానికి చెందిన నాయకులు స్వాతిరాణి రేసు లో ఉన్నారు. ఇప్పుడు అదే రేసులోకి రాజన్నదొర కూడా చేరడంతో సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఒకవేళ రాజన్నదొర ఎంపిగా వెళ్తే తనకు సాలూరు ఎమ్మెల్యే సీటు కావాలని కూడా స్వాతీరాణి కోరుతున్నారు. స్వాతిరాణి భర్త గుల్లిపిల్లి గణేష్‌ది సాలూరు కావడంతో పాటు నియోజకవర్గంలో ఆయనకు బలమైన సామాజిక సంబంధాలు వున్నాయి. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన స్వాతిరాణికి మన్యం జిల్లాతో పాటు, నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నాయకులతో పరిచయాలు ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో తాను ఎమ్మెల్యేకైనా పోటీకి సిద్ధమేనన్న సంకేతాలు పంపించారు. ఇదిలా ఉండగా నియోజకవర్గ పరిధిలో గల పాచిపెంట ఎంపిపి బి.ప్రమీల పేరును కూడా ఆయన సూచించే అవకాశాలు ఉన్నాయి. ప్రమీల ఉన్నత విద్యావంతురాలు, రాజకీయాల పట్ల అవగాహన ఉన్న గిరిజన నాయకురాలిగా గుర్తింపు ఉంది. ఆమె భర్త నియోజకవర్గంలో ప్రధాన సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం అనుకూల పరిణామంగా కనిపిస్తోంది. అయితే తాను ఎంపీగా వెళ్తే ఎమ్మెల్యే సీటు విషయంలో రాజన్నదొర ఎవరికి సిఫార్సు చేస్తారనే చర్చ కూడా తెరపైకి వస్తోంది. ఒకవేళ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై సలహా అడిగితే ఆయన ఎవరి పేరు సూచిస్తారనేది చర్చనీయాంశమవుతోంది.

➡️