రాముడు రాణించేనా?

ప్రజాశక్తి – కడప ప్రతినిధిరాయచోటిలో టిడిపి రాణిం చడంపై ఆసక్తికరచర్చ నడుస్తోంది. టిడిపి అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఆర్‌.రమేష్‌రెడ్డి, ద్వారక నాధరెడ్డి, యువ నాయకులు ఎస్‌.ప్రసా ద్‌బాబు వంటి హేమాహేమీలతో పోటీపడి టికెట్‌ను దక్కించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. వీరిద్దరినీ ఏకతాటిపైకి తేవడం గెలుపు సాధించినంత పని అవుతోంది. ఏకతాటిపై తీసుకుని వస్తే గెలుపు సులభం. రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థిగా ఎస్‌.బాలసుబ్రమణ్యం బరిలో నిలవనుండడం కొంత ఉపశమనం కలిగి స్తోంది. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు దగ్గరికి ప్రసాద్‌బాబును పిలిపించి సయో ద్య కుదుర్చుకోవడం ఓ ముందడుగే. కానీ మాజీఎమ్మెల్యేలు ఆర్‌.రమేష్‌రెడ్డి, ద్వారకనాధరెడ్డిల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. వీరిద్దరి అసంతృప్తిని చల్లార్చడం సులభం కాదనే వాదన వినిపిస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే అధికారం రుచి చూసిన వారు కావ డంతో అంగీకారం తెలిపే అవకాశాలు తక్కువ. ఒక వేళ అంగీకారం తెలిపినప్పటికీ పూర్తి స్థాయిలో సహకరించే అవకాశాలు తక్కువే. ఇదిలాఉండగా మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌రెడ్డి ఆత్మీయ సమావేశాల్లో తాను ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. టికెట్‌ దక్కని పక్షంలో ఇతర పార్టీలు టికెట్‌ ఇస్తే బరిలో నిలిచే అవకాశాలూ లేకపోలేదు. ఒకవేళ ఇదే జరిగితే రాయచోటి, చినమండెం, సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, రామాపురం మండలాల్లో టిడిపి ఆటుపోట్లను ఎదుర్కోవలిసి వస్తోంది. లక్కిరెడ్డిపల్లి, రామాపురం, గాలివీడు మండలాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. మరో మాజీ ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డి టికెట్‌ విషయంలో చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారం వారం సర్వేపై ఆధారపడి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నికల బరిలో నిలవడానికి కావలిసిన ఆర్థిక, సామాజిక, అంగబలాలను కలిగి ఉన్న నేపథ్యంలో తనకు టికెట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్‌ దక్కని నేపథ్యంలో నెలకొన్న ఆసంతృప్తిని క్యాష్‌ చేసుకునే పనిలో ఇతర పార్టీలు ఉన్నట్లు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. టిడిపి, బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే రాయచోటిలోని 2.50 లక్షల ఓటర్లలో 44 శాతం ముస్లిమ్‌ ఓటర్లు కలిగిన నియోజకవర్గం. ఇంతటి లోటును అధిగమించి రాణించడం తీవ్రమైన సవాలుతో కూడుకున్న వ్యవహారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పట్ల నెలకొన్న వ్యతిరేక తను, అధికార పార్టీ పట్ల నెలకొన్న నెగిటివ్‌ ఓటును ఆధారం చేసుకుని గెలుపు సాధిస్తామనే ఆశలను కేంద్రంలో బిజెపి సర్కా రు నిర్వీర్యం చేస్తోంది. దీనికితోడు ఎన్నికల షెడ్యూలు నాటికి సిఎఎ గైడ్‌లెన్స్‌ విడుదల చేస్తామని కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రకటిస్తున్న నేపథ్యంలో ముస్లిమ్‌ ఓటర్లు చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. ముస్లిం ఓటర్ల లోటును అధిగమించడానికి పొత్తు ధర్మలోని పార్టీల ప్రాబల్యమూ తక్కువ కావడం గమనార్హం. ఇక్కడ ఎటు చూ సినా బిజెపి, జనసేన పార్టీల ఓటర్లు చేతివేళ్ల మీద లెక్కించే పరిస్థితి నెలకొంది. ఒక పక్క చల్లారని అసంతృప్తులు, మరో పక్క ముస్లిముల ఓటర్లను కోల్పోయే అవకాశాల మధ్య తీవ్రమైన ఆటుపోట్లను ఎదు ర్కోవాల్సి వస్తోందని చెప్పవచ్చు.

➡️