రాయచోటి అసెంబ్లీకి అలీఖాన్‌ దరఖాస్తు

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అన్నమయ్య జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ చైర్మన్‌, ప్రముఖ ఆడిటర్‌ మన్సూర్‌ అలీఖాన్‌ రాయచోటి అసెంబ్లీ టికెట్‌ కోసం శుక్రవారం విజయ వాడలోని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పిసిసి చీఫ్‌ వైఎస్‌.షర్మిల పిలుపుతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు దర్బార్‌బాషా, యహియాబాషాలతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాల యంలో తన దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయితో పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్నానన్నారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం నిరంతరం శ్రమిస్తూ వస్తున్నానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాయచోటి అసెంబ్లీతో పాటు రాజంపేట పార్లమెంట్‌ స్థానానికి కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో పలువురు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తులను అందజేశానని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పవనాలు వీస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లోని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిందన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైసిపి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత, ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఎటువంటి మేలు చేయని తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతప్తి కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వస్తాయని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పిసిసి చీఫ్‌ వైఎస్‌.షర్మిల సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టి రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

➡️