రిజిస్ట్రేషన్లు వేగంగా పూర్తి చేయాలి : జెసి

Feb 12,2024 20:13

ప్రజాశక్తి-విజయనగరం : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద ఇచ్చిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లను త్వరగా పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ ఆదేశించారు. ఎన్‌పిఐ రిజిస్ట్రేషన్లు, కుల గణణ, ఆడుదాం ఆంధ్ర యుసిల సమర్పణ, ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, యాప్‌ డౌన్‌లోడ్‌, రీసర్వే, స్టోన్‌ ప్లాంటేషన్‌, గృహనిర్మాణం తదితర అంశాలపై వివిధ మండలాల ప్రగతిని సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ఎన్‌పిఐ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సచివాలయాలు లేని చిన్నచిన్న గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించాలన్నారు. రీ సర్వేకు సంబంధించి తాహశీల్దార్లు తమకు వచ్చిన దరఖాస్తులను ఒక్కరోజులోనే క్లియర్‌ చేయాలన్నారు. సర్వే రాళ్లు పాతే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు కోసం వచ్చే దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, ముఖ్యంగా రోజులతరబడి ఉండిపోయిన పెండింగ్‌ దరఖాస్తులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణకు సంబంధించి తక్షణమే యుసిలను పంపించాలని ఆదేశించారు. గృహనిర్మాణ కార్యక్రమంలో భాగంగా మెగా కంప్లీషన్‌ డ్రైవ్‌ లక్ష్యాన్ని చేరుకొనేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఒ పి.బాలాజీ, డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి, మెప్మా పీడీ సుధాకరరావు, సచివాలయాల స్పెషల్‌ ఆఫీసర్‌ నిర్మలాదేవి, సర్వే ఎడి త్రివిక్రమరావు, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ ఉమాశంకర్‌, ఐసిడిఎస్‌ పీడీ శాంతకుమారి, ఎపిఎంఐపి పీడీ లక్ష్మీనారాయణ, వివిధ ప్రాంతాలనుంచి ఆర్‌డిఓలు, ఇఆర్‌ఒలు, మండల ప్రత్యేకాధికారులు, తాహశీల్దార్లు, ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️