వాగ్దానాలను విస్మరించి మోసం చేసిన కేంద్రం

Feb 12,2024 00:35

ఐతానగర్‌లో మహిళ పాడి రైతులతో మాట్లాడుతున్న శివసాంబిరెడ్డి
ప్రజాశక్తి – మంగళగిరి : కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 16వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఎఐటియుసి పట్టణ కార్యదర్శి ఎ.ప్రభాకర్‌ సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం.బాలాజి. ఎఐఎఫ్‌టియు నాయకులు కె.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి కార్పొరేట్లకు అప్పగించే విధంగా చట్టాలు మారుస్తోందని, దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగిందని చెప్పారు. ఆ సందర్భంలో పంటలకు మద్దతు ధర ఇస్తామని చేసిన వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. రైతు సంఘం నాయకురాలు వల్లూరి భారతి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తుంటే మన రాష్ట్రంలో భూములు మాయం చేసే విధంగా భూ చట్టాలను తీసుకొస్తున్నారని అన్నారు. ఇది రైతుల భూములను వివాదాల్లోకి నెట్టుతుందని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడుతూ పారిశ్రామిక వివాదాల చట్టాల్ని మార్చేసి 4 కోడ్లుగా చేసి కార్మికవర్గాన్ని కాల్చుకు తినే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఎఐటియుసి నాయకులు చిన్ని సత్యనారాయణ మాట్లాడుతూ కార్మిక చట్టాలు మార్చి కార్మికులను నిరంకుశంగా పని చేయించుకునే విధంగా పని గంటలు మార్పులు చేసి కార్మికుల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు. సమావేశంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, సిఐటియు మండల కార్యదర్శి వి.పూర్ణ, ఎఐఎఫ్‌టియు నాయకులు ఆదినారాయణ, ప్రజా సంఘాల నాయకులు యు.దుర్గారావు, అజరు కుమార్‌ పాల్గొన్నారు.ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : డాక్టర్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫార్సు మేరకు అన్నిరకాల పంటలకు మద్దతు ధర చట్టం తేవాలని కోరుతూ ఈనెల 16న జరిగే గ్రామీణ బందులో మహిళ పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు మలకా శివసాంబిరెడ్డి కోరారు. ఆదివారం వేజెండ్ల తబిత అధ్యక్షతన స్థానిక ఐతానగర్‌లో సమావేశం నిర్వహించారు. సాంబిరెడ్డి మాట్లాడుతూ పశుగ్రాసం, తౌడు, దాణా ఖర్చులు పెరగడంతో పశుపోషణ భారంగా మారిందన్నారు. వీటితోపాటు పశువులచావడి నిర్మాణానికి రూ.లక్షా 60 వేలు హామీలేని రుణం ఇచ్చే అవకాశం ఉన్నా బ్యాంకు అధికారులు మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. రైతు రుణాలు మాఫీ చేస్తూ కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలన్నారు. ఆహార భద్రత చట్టాన్ని పటిష్ట పరచాలని కోరుతూ జరిగే బంద్‌ను ప్రజలంతా జయప్రదం చేయాలన్నారు. కె.శకుంతల, ఎం.రజిని, సరోజినీ, సుశీల, ఇ.బేబీరాణి, కమలమ్మ, ధనమ్మ పాల్గొన్నారు.

➡️