వాలంటీర్ల సేవలు అమోఘం: మంత్రి నాగార్జున

ప్రజాశక్తి-సంతనూతలపాడు: గ్రామాల అభివృద్ధిలో వాలంటీర్ల సేవలు అమోఘమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని ఎండ్లూరులో గురువారం రాత్రి జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మంత్రి నాగార్జున మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల పాలనా కాలంలో వాలంటీర్లు చాలా కీలకంగా వ్యవహరించారని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో వాలంటీర్లు ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. కోవిడ్‌ సమయంలో జగనన్న ప్రభుత్వం ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఎండ్లూరు గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ చాలా బాగుందని గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. జగనన్న లే అవుట్‌లో గ్రామంలో 427 మంది పేదలకు రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం పూర్తయిందని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని సంతనూతలపాడు, రుద్రవరం, ఎండ్లూరు, మైనంపాడు, పి గుడిపాడు, గురవారెడ్డి పాలెం, ఆర్‌ లక్ష్మీపురం తదితర గ్రామాల్లో సేవలు అందిస్తున్న వాలంటీర్లను సన్మానించారు. మొత్తం 156 మంది వాలంటీర్లకు గాను ఒకరికి సేవారత్న, 155 మందికి సేవా మిత్రలకు అవార్డులను అందించి వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ బి విజయ, జడ్పిటిసి దుంపా రమణమ్మ, వైసీపి మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, గ్రామ సర్పంచ్‌ ఎస్‌ పుల్లయ్య, ఉప సర్పంచ్‌ కుంచాల వెంకటమారుతీ దేవి, ఎంపీటీసీ కే వెంకటేశ్వరరావు, వైసిపి గ్రామ అధ్యక్షులు కుంచాల అంజయ్య, సొసైటీ చైర్‌పర్సన్‌ దుంపా యలమందారెడ్డి, ఎంపిడీఓ కార్యాలయ ఏఓ డీఎస్వి ప్రసాద్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శి దారా వెంకట్రావు, వీఆర్వో షేక్‌ మౌలాలి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

➡️