విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Oct 30,2024 21:43

నలుగురు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అరెస్టు, విడుదల

 సమస్యలు పరిష్కరించాలని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : నగరంలోని మున్సిపల్‌ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడికి చేరుకున్న ర్యాలీని పోలీసులు అడ్డుకొని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో నాయకులు నిరసించడంతో నలుగురు నాయకులను బలవంతంగా లాక్కెళ్లి ఒకటవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ విద్యార్థులంతా ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద బైఠాయించారు. అరెస్టు అయిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి.రాము, జిల్లా ఉపాధ్యక్షులు జె.రవికుమార్‌, నాయకులు గుణ, వాసు ఉన్నారు. ధర్నాను ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు కె.రాజు, పి.రమేష్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయని అన్నారు. కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వమైనా వాటిని పరిష్కరిస్తుందని చూశామని, కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ప్రభుత్వ తీరు ఉందని అన్నారు. స్థానిక బిపిఎం పాఠశాలలో చిన్న వర్షం పడితేనే గ్రౌండ్‌ మొత్తం చెరువును తలపిస్తోందని తెలిపారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేసినప్పటికీ డోర్లు బిగించలేదన్నారు. తాగునీటి సదుపాయం కూడా లేదన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం కూడా అధ్వానంగా ఉంటుందని విమర్శించారు. గాజులరేగ , కంటోన్మెంట్‌ హైస్కూళ్లలో తరగతి గదులు సరిపడా లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట చదువుకునే పరిస్థితి ఉందన్నారు. తక్షణమే అధికారులు ఈ సమస్యలు పరిష్కరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సమస్యలపై ఈనెల 6న జరగబోయే చలో కలెక్టరేట్‌ను జిల్లాలో ఉన్న విద్యార్థులంతా జయప్రదం చేయాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతినిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భారతి , రాహుల్‌, ఎర్రమ్మ ,మురళి ,శిరీష , చిరు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
➡️