విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న ప్రభుత్వాలు

Nov 27,2024 21:29

ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం

అదానీతో అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలి

ఎఐఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రమహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్రజాశక్తి-విజయనగరంకోట : ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ విద్యారంగంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కాపాడుకునేందుకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదానీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. విజయనగరంలో జరుగనున్న ఎఐఎస్‌ఎఫ్‌ 49వ రాష్ట్ర మహాసభలు బుధవారం ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి గురజాడ కళాక్షేత్రం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలోను, అనంతరం జరిగిన ప్రతినిధుల సభలోను కె.రామకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పగడ్బందీగా అమలు చేయాలని దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య లౌకిక పార్టీలు కోరుతుంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి మతోన్మాద శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. బిజెపి మాజీ ఎంపి సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టుకు వెళ్లి రాజ్యాంగ పీఠికలో పొందపరిచిన సామ్యవాద, లౌకిక అనే పదాలను తొలగించాలని పిల్‌ వేశారని, సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా సెక్యులర్‌ సోషలిస్ట్‌ పదాలను తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిందని తెలిపారు. అదానీకి నరేంద్ర మోడీ, అమిత్‌ షా వత్తాసు పలుకుతూ ప్రభుత్వ రంగ ఆస్తులను దోచిపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో సెకీ ద్వారా విద్యుత్‌ ఒప్పందం చేసుకున్నప్పుడే రాష్ట్ర ప్రజలపై లక్ష పదివేల కోట్లు భారం పడుతుందని చెప్పామని, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టులో పిల్‌ వేశామని తెలిపారు. రూ.2150 కోట్లు ముడుపులు చేతులు మారాయని స్పష్టంగా అర్థమవుతోందని,ఈ అక్రమాలపై రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో నరేంద్ర మోడీ ఇప్పటికైనా స్పందించాలన్నారు. జగన్‌ ప్రభుత్వంలో 1750 కోట్లు చేతులు మారాయని తెలుస్తోందని, దీనిపై సమాధానం చెప్పాలని అన్నారు. అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గురజాడ కళాక్షేత్రంలో ఆడిటోరియంలో ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్‌ సింగరాజన్‌ మాట్లాడారు. ఎఐఎస్‌ఎఫ్‌ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.జాన్సన్‌బాబు, కె.శివారెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పాఠ్యాంశాలలో మత భావాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలు చేర్చుతోందని మండిపడ్డారు. నూతన విద్యా విధానం పేరుతో 52 వేల ప్రభుత్వ పాఠశాలలను మూత వేయడానికి కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యాసంస్థలను కాపాడుకునేందుకు విద్యార్థులు ముందుకు రావాలన్నారు. ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తన గేయాలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు.

➡️