విమానాశ్రయ నిర్మాణపనుల్లోఉపాధికల్పన ఉత్తిమాటే!

Feb 10,2024 21:12

ప్రజాశక్తి- భోగాపురం : విమానాశ్రయం వస్తే మీ ప్రాంతంలో ఆందరికీ ఉపాధి కలుగుతుందని అధికారులు, నాయకులు ఆశ చూపారు. దీంతో ఎకరా కోట్లలో ఉన్న భూమిని లక్షల్లోనే ప్రభుత్వానికి అప్పజెప్పారు. తీరా ఇక్కడ వారికి ఉపాధి కల్పించకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి నిర్మాణ సంస్థ ఉపాధి చూపడంతో ఖంగుతిన్నారు. నిర్మాణ సంస్థ కనీసం ఒక జాబ్‌ మేళా కూడా నిర్వహించి కనీసం చదువుకున్న వారికైనా సరే ఉద్యోగాలు కల్పించడం లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తీరుపై మండిపడుతున్నారు. చివరకు అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ ప్రాంత వాసులకు ఉద్యోగాలు కల్పించాలని నిర్మాణ సంస్థకు వినతి పత్రం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం గమనార్హం.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జిఎంఆర్‌ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టి సంస్థకు అప్పజెప్పింది. ఈ పనులు గత మూడు నెలలుగా జరుగుతున్నాయి. సుమారు 1500 మంది కూలీలు ప్రస్తుతం పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో స్థానికులు కాకుండా బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశాకు చెందిన వారిని తీసుకువచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన వారికి మాత్రం ఉపాధి పనులు కల్పించడం లేదు. దీంతో వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే భూములకోసం పోరాడినట్లు ఉద్యోగాల కోసం కూడా రోడ్లుపైకి వచ్చి పోరాటాలు, ధర్నాలు చేసేందుకు వెనకాడేది లేదని చెబుతున్నారు. కనీసం జాబ్‌మేళా కూడా లేదువిమానాశ్రయం నిర్మాణానికి మండలానికి చెందిన అనేక మంది రైతులు సుమారు 2700 ఎకరాల భూమిని ఇచ్చారు. భూసేకరణ సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి నిర్మాణం సమయంలో అనేక మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపారు. అంతేకాక నిర్మాణం పూర్తయిన తరువాత కూడా అనేక ఉద్యోగాలు వస్తాయని నమ్మించారు. దీంతో చాలా మంది రైతులు మన ప్రాంతం అభివృద్ది చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు వస్తాయని కోట్ల విలువైన భూమిని ప్రభుత్వ ధరకే ఇచ్చేశారు. విమానాశ్రయం పనులు ప్రారంభమై సుమారు మూడు నెలలు జరుగుతుంది. అయినా ఇప్పటివరకు విమానాశ్రయం నిర్మిస్తున్న జిఎంఆర్‌ సంస్థతో పాటు ఎల్‌అండ్‌టి సంస్థ కూడా ఒక్క జాబ్‌మేళా కూడా నిర్వహించలేదు. పోనీ కూలి పనులు కల్పించకపోయినప్పటికీ ఐటిఐ, డిప్లమా, బిటెక్‌ సివిల్‌ ఇంజినీరు చదువుకున్నవారు, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు దొరక్క బయట రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారికైనా ఉద్యోగాలు కల్పించేందుకు ఒక్క జాబ్‌మేళా కూడా నిర్వహించడం లేదు. ప్రజాప్రతినిధులు కూడా కనీసం నిర్మాణ సంస్థతో మాట్లాడి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదు.

ఉద్యోగాలు కల్పించాలని జిఎంఆర్‌ సంస్థకు వినతి

ఈ ప్రాంత వాసులకు ఉద్యోగాలు కల్పించాలని హౌసింగ్‌బోర్డు రాష్ట్ర డైరెక్టర్‌ ఉప్పాడ శివారెడ్డి, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ బైరెడ్డి యర్రప్పలనారాయణ, మాజీ జెడ్‌పిటిసి బైరెడ్డి ప్రభాకరరెడ్డితో పాటు మరికొంత మంది జిఎంఆర్‌ సంస్థ ప్రతినిధి సుబ్బారావుకు రెండు రోజులు కిందట వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో సగం మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

➡️