వెంటాడుతున్న నీటి కాలుష్యం

Feb 13,2024 00:33

శారదా కాలనీలో పైపులైన్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, కమిషనర్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
గురటూరు నగరపాలక సంస్థ పరిధిలో విలీనగ్రామాలకు కూడా కలిపి రూ.460 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన సమగ్ర రక్షిత నీటి పథకం పనులు పూర్తయినా ఇంత వరకు తాగునీటి కష్టాలు తీరడం లేదు. 2013లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈనిధులు మంజూరవడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత రాష్ట్ర విభజన, టిడిపి ప్రభుత్వం ఈ పనులను కొనసాగించింది. 24 గంటలనీటి సరఫరా లక్ష్యంతో ఈ ప్రాజెక్టును తీసుకువచ్చారు. ఈ ప్రాజెక్టు చేపట్టి పదేళ్లయినా ఇప్పటికి గుంటూరులో తాగునీటి కష్టాలు కొనసాగుతున్నాయి. నీటి సరఫరా పూర్తిస్థాయిలో జరగడం లేదు. 24 గంటల సంగతి ఎలాఉన్నా కనీసం రోజుకు గంటన్నర పాటు పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరిగే ప్రాంతాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ ప్రాంతాల్లో రోజుకు 30 నుంచి 40 నిమిషాలు కూడా తాగునీటి సరఫరా జరగడం లేదని పలుమార్లు మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రజా ప్రతినిధులు నిలదీశారు. 2018లో కూడా పైపులైన్లు లీకేజి కావడం, తాగునీటిలో డ్రైనేజినీరు కలిసి పలు ప్రాంతాల్లోనీరు కలుషితమై 24 మంది మృత్యువాతపడగా వేలాది మంది అస్వస్తతకు గురయ్యారు. ఆరేళ్లతరువాత మళ్లీ ఇటువంటి ప్రమాదం నగర వాసులను వెంటాడుతుంది. గత మూడు రోజుల్లో 75 మంది తీవ్రమైన వాంతులు, విరోచనాలతో గుంటూరు ప్రభుత్వఆస్పత్రికి వచ్చారు. వీరిలో 15 మంది డిశ్చార్జి అయ్యారు. 60మంది చికిత్స పొందుతున్నారు. పలు అర్బన్‌ హెల్త్‌సెంటర్లు, ఆర్‌ఎంపిల వద్ద కూడా పెద్దసంఖ్యలో రోగులు చికిత్సలు పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు కూడా డయేరియా కేసుల తాకిడి పెరిగింది. గుంటూరులో డయేరియా కేసులు ప్రారంభం అయిన రోజు చాలా తేలికగా మాట్లాడిన కొందరు ప్రజా ప్రతినిధులు ఇప్పుడు కంగారుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉన్నతాధికారులందరిని గుంటూరు పంపే వరకు నగరంలోని ప్రజా ప్రతినిధులంతా ఈ అంశాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. ఆ..ఏముంది…నిత్యం ఐదారుగురు జిజిహెచ్‌కి రావడం సహజం అని పలాయనవాదంతో మాట్లాడిన నాయకులంతా ఇప్పుడు కంగారుపడుతున్నారు. మూడు రోజుల్లో జిజిహెచ్‌కే 75 మంది వస్తే మిగతా ఆస్పత్రులు, ఇతర వైద్యుల వద్ద ఎంతమంది చికిత్స పొందుతున్నారనే అంచనాలు కూడా రూపొదించే పరిస్థితి లేదు. నగరంలో రూ.450 కోట్లు ఖర్చుచేసి రక్షితనీటి పథకాన్ని నిర్మించి తరచూపైపు లైన్ల లీకేజిలు వెంటాడి నీటి సరఫరా నిలిచిపోతోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లకు వచ్చే నీటి సరఫరా పైపు లైన్లు అన్ని మురుగు కాల్వల్లోనే ఉంటున్నాయి. గతంలో ఉండే పైపులైన్లను తొలగించి కొత్త ప్రాజెక్టు కింద ఫైబర్‌ ట్యూబులు అమర్చారు. ఇవి కూడా మురుగుకాల్వల గుండా ఇళ్లలోకి వేస్తున్నారు. వీటిపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేదు.ఏఈ స్థాయిలో కనీసం రోజుకు ఒక వార్డులో ఉన్న పైపులైన్లు కూడా పరిశీలించే పరిస్థితి లేదు. అంతా ఫిట్టర్లు, ప్రైవేటు కాంట్రాక్టు వర్కర్లపైనే పైపు లైన్ల నిర్వహణా అంతా జరిగిపోతోంది. ఏదైనా సమస్య వచ్చి నీటి కాలుష్యం ఏర్పడితే అప్పుడు ఉన్నతాధికారులు కదలివచ్చినా ఏఈ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు మచ్చుకయినా కన్పించవు. ఇక డి.ఈ., ఈ.ఈస్థాయి అధికారులంతా ఇతర పనులపైనే దృష్టి సారిస్తారు. ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో తాగునీటి వ్యవహారంపై దిగువ స్థాయి సిబ్బంది చెప్పిందే వేదం తప్ప ఎఈ, డిఈ స్థాయి అధికారుల పరిశీలన పెరగకపోవడం వల్ల నగరంలో తరచూ ప్రజలు రోగాల బారినపడుతున్నారు. సాధారణంగా తాగునీరు కాచి చల్లార్చకుండా నేరుగా తాగిన సందర్భాల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. తాగునీటి సమస్యలు పట్టించుకోకుండా అధికార యంత్రాంగం అంతా మినరల్‌ వాటర్‌ ముసుగులో ఉన్న క్యాన్ల వాటర్‌, వాటర్‌ బాటిల్స్‌ వినియోగానికి ప్రాధాన్యమివ్వడం వల్ల సామాన్యుల తాగునీటి కష్టాలు ఎవ్వరికీ పట్టడం లేదు. దీంతో కాలుష్యం సమస్య వచ్చినప్పుడే ఉరుకులు పరుగులుపెట్టడం పరిపాటైంది.

➡️