‘వెలిగొండ’తో కాంట్రాక్టర్లకు లబ్ధి

ప్రజాశక్తి-మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం రైతులకు ప్రయోజనం ఏమాత్రం చేకూర్చుతుందో తెలియదు కానీ… కాంట్రాక్టర్లకు మాత్రం లబ్ధి చేకూర్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి కొండారెడ్డి ఆరోపించారు. డిజైన్‌ ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం జరగపోవడంతో కాంట్రాక్టర్లకు అదనంగా రూ.879 కోట్లు లబ్ధి చేకూరిందని ఆరోపించారు. ఈ మేరకు కాగ్‌ నివేదికలో వెల్లడైందని ఆయన చెప్పారు. ఆదివారం స్థానిక రెడ్డి మహిళా జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జివి కొండారెడ్డి మాట్లాడారు. 2017 నుంచి 2021 మధ్యకాలంలో కాలువల్లో, టన్నెల్లో తగ్గిన సామర్థ్యాన్ని కాగ్‌ గుర్తించినట్లు చెప్పారు. అంచనాలు మాత్రం డిజైన్‌లో చూపిన విధంగా రూపొందించారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగమయ్యిందని ఆరోపించారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు, ఖర్చుచేసిన నిధులకు పొంతన లేకుండా పోయిందన్నారు. ప్రాజెక్టు తొలిదశ నేటికీ పూర్తి కాలేదన్నారు. రెండో దశ ఎప్పుడు పూర్తవుతోందో కూడా తెలియదన్నారు. కరువు ప్రాంతంలో ప్రాజెక్టు లక్ష్యానికి తూట్లు పొడిచారని విమర్శించారు. సొరంగ మార్గాల వద్ద నీటిని సరఫరా చేసే సామర్థ్యం 483 క్యూసెక్కులు కాగా కాలువ సైజు తగ్గిపోవడంతో 328 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందన్నారు. దీంతో ప్రాజెక్టులోకి నీటిని వరదల సమయంలో సకాలంలో నింపుకోలేమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు లక్ష్యానికి పాలకులు తూట్లు పొడిచినట్లేనని ఆరోపించారు. వెలిగొండలో నాలుగో గ్యాప్‌ నిర్మాణం ఎవరికీ తెలియదన్నారు. కాగ్‌ నివేదికలో ఇది బయటపడిందన్నారు. దాన్ని నిర్మిస్తేనే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందన్నారు. సొరంగాల్లో ఇంకా లైనింగ్‌ పనులు మిగిలి ఉన్నాయన్నారు. వెలిగొండ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. తొలిదశ ఎప్పుడు ప్రారంభిస్తారో.. రెండో దశ పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరువు పీడిత ప్రాంత ప్రజల ఆశాజ్యోతి వెలిగొండ విషయంలో పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. వెలిగొండకు నికర జలాల కోసం ప్రయత్నించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి సోమయ్య, సిపిఎం నాయకులు డికెఎం రఫీ తదితరులు పాల్గొన్నారు.

➡️