వైసిపికి పిల్లా, అవనాపు రాజీనామా

Feb 13,2024 21:24

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : వైసిపి సీనియర్‌ నాయకులు పిల్లావిజయకుమార్‌, యువజన విభాగం నాయకులు అవనాపు.విజరు, మాజీ కౌన్సిలర్‌ గాడు అప్పారావు ఆ పార్టీకి రాజీనామా చేవారు. మంగళవారం అవనాపు విజరు నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈమేరకు రాజీనామా లేఖను విడుదల చేశారు. అనంతరం అవనాపు విజరు మాట్లాడుతూ 2009లో మొదటి సారి జగన్‌ కి చేదోడు వాదోడుగా ఉన్నామన్నారు. వైఎస్‌ మరణం తర్వాత ఒదార్పు యాత్రకు అన్ని విధాలా అండగా ఉన్నామన్నారు. ఆనాడు బొత్స సత్యనరాయణను, అశోక్‌గజపతిని ఎదుర్కొని నిలబడ్డామన్నారు. జగన్‌ సిఎం అవ్వడం ముఖ్యమని కోలగట్ల గెలుపుకోసం పని చేశామన్నారు. ఆస్తులు పోగొట్టుకొని, అనేక సేవలు వైసిపికి అందించామన్నారు. కానీ పార్టీలో తమకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వకుండా అవమానపరిచారని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం పని చేసిన తమ భవిష్యత్‌ రాజకీయాలకు అన్యాయం చేయడం తగదన్నారు. ఈ విషయం విజయసాయి రెడికి, వైవి సుబ్బారెడ్డికి, జిల్లా నాయకులు బొత్స సత్యనారాయణకు, మజ్జి శ్రీనివాసరావుకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. అందుకే రాజీనామా చేసి టిడిపిలో చేరడానికి సిద్దమైనట్లు తెలిపారు. పిల్లా విజయకుమార్‌ మాట్లాడుతూ పదవులతో రాజకీయం చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే కోలగట్ల పని చేశారన్నారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే కోలగట్ల ఓడిపోవడంతో ఆయన అక్కడినుంచి పార్టీ జిల్లా బాధ్యతలు చేపట్టి అవనాపు కుటుంబ సభ్యులను తొక్కే పెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఆనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏదో ఒక పార్టీలోకి వెళ్లాలని మంత్రి బొత్స చెప్పడంతో ఆయనతో పాటు వైసిపిలో చేరామన్నారు. పార్టీలో గ్రూపులు పెట్టీ ముక్కలు చేసే ప్రయత్నం చేయడం కోలగట్ల ద్వారా జరిగిందన్నారు. నేడు కాలనీల్లో ఏపని కావాలన్నా ఎమ్మెల్యే తప్ప కార్పొరేటర్ల ద్వారా ఏ పనీ కావడం లేదన్నారు. డిప్యూటీ మేయర్‌ ఎస్సీలకు ఇవ్వాలని కోరితే ఇవ్వకుండా ఆయన కుమార్తెకు ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే బాధను బరించలేక పరువు కోసం చాలామంది కార్పొరేటర్లు పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఉన్న జ్యూట్‌ పరిశ్రమలను మూసి వేయించి ఎమ్మెల్యే కోలగట్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. మాన్సాస్‌ వ్యవహారంలో ఆందగజపతి రాజు కుమార్తెను దించి తగువులు పెట్టించారన్నారు. విజయనగరం పట్టణానికి పట్టిన ఎమ్మెల్యే పీడను వదిలించుకోవడానికి రాజీనామాలు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్‌ గాడు అప్పారావు అనుచరులు ఉన్నారు. అనంతరం రాజాం వెళ్లి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కళా వెంకటరావును కలిశారు. సాయంత్రం పిళ్లా విజయకుమార్‌ ఇంటికి జనసేన నాయకులు లోకం మాధవి, పడాల అరుణ వెళ్లి తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు.

➡️