వైసిపి, టిడిపి, జనసేనను ఓడించండి

Feb 12,2024 20:09

  ప్రజాశక్తి-బొబ్బిలి  : బిజెపి విధానాలకు మద్దతు ఇస్తున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బిజెపికి ప్రాతినిధ్యం లేనప్పటికీ అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు బిజెపి విధానాలను సమర్దిస్తున్నాయని తెలిపారు. బిజెపి మతోన్మాద విధానాలను అమలు చేసి కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా చట్టాలను చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి, రైల్వే జోన్‌ ఇవ్వకపోయినా ఈ పార్టీలు నోరు మెదపడం లేదన్నారు. రాష్ట్రంలో ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటున్న వైసిపి, టిడిపిలు ఢిల్లీలో బిజెపితో చెలిమి చేసి ప్రజల ప్రయోజనాలకు నష్టం చేస్తున్నాయని విమర్శించారు. విశాఖ స్టీల్‌ పరిశ్రమను అమ్మేస్తున్నప్పటికీ ప్రశ్నించడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని, బిజెపికి మద్దతు ఇస్తున్న వైసిపి, టిడిపి, జనసేనలను ఓడించాలని కోరుతూ ఈనెల 20న విజయవాడలో జరగనున్న బిజెపి వ్యతిరేక, లౌకిక పార్టీల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఆయనతో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు ఉన్నారు.

➡️