శారదా కాలనీలో పర్యటించిన కలెక్టర్‌

Feb 13,2024 00:29

శారదా కాలనీ యుపిహెచ్‌సిలో బాదితుల్ని పరామర్శిస్తున్న మేయర్‌, కమిషనర్‌ తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు :
స్థానిక శారదా కాలనీలో జిల్లా కలెక్టర్‌ యం.వేణుగోపాల్‌రెడ్డి నగర కమిషనర్‌ కీర్తి చేకూరితో కలిసి సందర్శించి త్రాగునీటి కుళాయిల పరిస్తితి, పారిశుధ్య పరిస్థితుల్ని పరిశీలించారు. స్థానికులతో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వేకు నియమించిన టీములు వారి ఇంటి వద్దకు వచ్చి వివరాలు సేకరించారా లేదా అనే విషయాన్ని కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. శారదాకాలనీ 9వ లైన్‌లో డ్రెయినేజి, రోడ్లను పరిశీలించారు. 22వ లైన్‌లో వున్న డాక్టర్‌ వైయస్సార్‌ పట్టణ ఆరోగ్య ప్రాధమిక కేంద్రంలో షిఫ్ట్‌ల వారీగా డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. స్వల్ప వాంతులు, విరోచనాలతో హెల్త్‌ సెంటర్‌లో చేరిన ఇద్దర్ని పరామర్శించారు. కాలనీ వాసులకు వాటర్‌ ట్యాంక్‌ల ద్వారా నీటిని అందించేందుకు, ఇంటింటి సర్వే వంద శాతం పూర్తయ్యేలా పర్యవేక్షించాలని కమిషనర్‌కు జిల్లా కలెక్టర్‌ సూచించారు.
ప్రతి ఇంటి నుండి నీటి నమూనాలు సేకరించాలి
వాలంటీర్ల సహకారంతో ఎమినిటీ సెక్రటరీలు డోర్‌ టు డోర్‌ నీటి నమూనాలు సేకరించాలని, ఎక్కడైనా కలుషిత నీటి సరఫరా గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలియచేయాలని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు, కమిషనర్‌ కీర్తి చేకూరి తెలిపారు. శారదా కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో చికిత్స పొందుచున్న వారిని మేయర్‌, కమిషనర్‌, డిప్యూటీ మేయర్‌ పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఎమినిటి కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి వాలంటీర్ల సహకారంతో తాగునీటి శాంపిల్స్‌ సేకరించాలన్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు తాగునీరు సరఫరా చేయు రిజర్వాయర్లను శుభ్రం చేయుటకు చర్యలు తీసుకోవాలని, శారద కాలని ప్రాంతంలో తాగునీటి పైపులైన్లకు లీకులు ఏమైనా ఏర్పడ్డాయేమో తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైసిపి గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌.నూరిఫాతిమా, డిప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు పాల్గొన్నారు. శారదా కాలనీకి ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌..శారదా కాలనీ రిజర్వాయర్‌లో డిప్యూటీ కమిషనర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ 9000002109, తాగునీటి సరఫరా, శ్యాంపిల్స్‌ పరిశీలన, లీకుల మరమ్మతులు, ప్రత్యేక పారిశుధ్య పనుల నిర్వహణకు ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేస్తున్నామని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు జిఎంసి పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. శారదా కాలనీలోని లైన్ల వారీగా అధికారులను కేటాయించి, పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రతిలైన్‌పై లీకులు గుర్తింపు, మరమ్మతు, డ్రెయిన్లలో ఉన్న పైప్‌ లైన్ల షిఫ్టింగ్‌, ప్రతి ఇంటిలో తాగునీటి శాంపిల్స్‌ సేకరణ, క్లోరినేషన్‌ తదితర చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న మినరల్‌ వాటర్‌ ప్లాంట్లలోనూ నీటి నమూనాలు సేకరించి, పరీక్షల నిమ్మిత్తం డైరెక్టర్‌ ఆఫ్‌ ఫుడ్‌ కంట్రోల్‌ విభాగానికి పంపాలని ఆదేశించారు.

➡️