భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ, ధర్నా
ప్రజాశక్తి-రాజాం (విజయనగరం జిల్లా) : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును బలోపేతం చేసి సమర్థవంతంగా నడపాలని డిమాండ్ చేస్తూ రాజాం నియోజకవర్గం పరిధిలో సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కార్మికశాఖ వరకు భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంక్షేమ బోర్డు సమర్ధవంతంగా నడపాలని, ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని నినాదాలు చేశారు. అనంతరం అక్కడ జరిగిన ధర్నాలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌వి నర్సింహారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక కొరత, కరోనాతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇసుక కష్టాలు నేటికీ కొనసాగుతున్నాయని అన్నారు. నవరత్నాల ముసుగులో వైసిపి ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిధులన్నీ దారి మళ్లించిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డు ఇవ్వకపోగా వందలాది మంది కార్మికులకు క్లెయిమ్‌లు చెల్లించలేదన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని,. వంద రోజులు కాలంలో ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని అన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా పథకాల అమలుపై స్పష్టత లేదని అన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి కార్మికునికి గుర్తింపు కార్డు ఇవ్వాలని, రెన్యువల్స్ ప్రారంభించాలని, సంక్షేమ బోర్డును సమర్థవంతంగా నడిపి అర్హులైన వారికి పథకాల అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియుజిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, అధ్యక్షులు పి.శంకర్రావు, నాయకులు ఎ.జగన్మోహన్, పి.విశ్వనాధం, ఎ.ఆదినారాయణ, డి.రవిశంకర్, కె. అసరప్పడు, ఎం.త్రినాధ, అర్జునరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.