సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలి : ఎస్‌పి

Feb 28,2024 21:36

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : త్వరలో జరగబోవు ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జనవరి మాసాంతపు నేర సమీక్షా సమావేశం నిర్వహించి, పెండింగ్‌లో వివిధ రకాల కేసులను సమీక్షించారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్థుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్‌ అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్‌, రికార్డ్స్‌ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు. అనంతరం రాబోవు ఎన్నికలను శాంతియుతంగా జరిపించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, అందరం ఇప్పటి నుంచే సిద్దంగా ఉండాలని సూచించారు. ముందుగానే సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ఆ ప్రాంతాలను సెక్టార్ల ప్రకారం విభజించి ప్రత్యేక అధికారులను నియమించి, అక్కడ అనుసరించాల్సిన కార్యాచరణ గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని, గతంలో ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక గ్రామాలు, అతి సమస్యాత్మక గ్రామాల్లో గతంలో జరిగిన కేసుల్లో ఎవరెవరు ముద్దాయిలుగా ఉన్నారు వారిపై తీసుకున్నంటున్న చర్యలను గుర్తించి ముందుగా సమాచారాన్ని సేకరించాలని ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచాలని తెలిపారు. సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎన్నికలకు సమాయత్తమయ్యే సందర్భంలో మద్యం, డబ్బు, మాదకద్రవ్యాలు రవాణా జరిగే ప్రదేశాలను ముందుగా గుర్తించి ఒక మ్యాపింగ్‌ తయారు చేయాలని, ఇఎస్‌ఎంఎస్‌ అప్లికేషను, విల్లింగ్‌, ఎంసిఒ నిబంధనలు గురించి, నిర్వర్తించే విధివిధానాల గురించి తెలిపారు. అలాగే ఏజెన్సీలో నిఘా ఉంచుతూ ఎప్పటికప్పుడు రోప్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. సమావేశంలో ఎఎస్‌పిలు ఒ.దిలీప్‌ కిరణ్‌, సునీల్‌ షరోన్‌, డిఎస్‌పిలు ఎస్‌.ఆర్‌.హర్షిత, జివి కృష్ణారావు, జి.మురళీధర్‌, ట్రైనీ డిఎస్పీ ఎస్‌ఎండి అజీజ్‌, పలువురు సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

➡️