సాహితీ లోకానికి మాస్టారు ‘కారా’

Feb 11,2024 20:33

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  ‘భగవంతుడికి జనం నమస్కరిస్తారు. ఆ భగవంతుడు మనిషిగా మారితే అప్పుడు కూడా అందరూ అతనికి నమస్కరిస్తారని అందరికీ తెలిసిన విషయమే. అయితే, దేముడు మానవుడైతే అప్పుడు అతనైనా సరే కాళీపట్నం రామారావుకు నమస్కరించి తీరవలసిందే!. రామారావు గారి వంటి సజ్జనుడి సాంగత్యం లభించడం నా అదృష్టం. ఆయన లాంటి గొప్ప కథకులుండటం మన జనం అదృష్టం.’ అంటూ రాచకొండ విశ్వనాధశాస్త్రి, యజ్ఞం కథాసంపుటి ముందు మాటగా 1971లో రాసారని సాహితీ ప్రముఖులు, కవులు, రచయితలు తెలిపారు. నేటి ఆధునిక కాలంలో కారా మాష్టారు రచనలు సాహితీ ప్రపంచానికి దిక్సూచని, సాహితీ లోకంలో అందరికీ మాస్టారు కారా మాస్టారు అని కొనియాడారు. ఆదివారం పార్వతీపురంలో స్నేహకళాసాహితీ ఆధ్వర్యంలో కారా మాస్టారి కథలతో కొంతసేపు సాహితీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కథా దీపధారి కాళీపట్నం రామారావు మాస్టారు శతజయంతి సంవత్సరం, కథానిలయం వార్షికోత్సవ సందర్బంగా ఉత్తరాంధ్రలో అన్నిచోట్ల ఆదివారం సాహితీ సమావేశాలు జరగ్గా పార్వతీపురంలోని గిరిజన్‌ భవన్‌ లో సాహితీవేత్త గోపాలరావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ప్రముఖ రచయిత గంటేడి గౌరీ నాయుడు, ఆముదాలవలస సాహితీ స్రవంతికి చెందిన పివిఎన్‌ మూర్తి, సహజ సాహితీ సాంస్కృతిక సంస్థకు చెందిన ఎన్‌కె బాబు, శ్రీకాకుళం సిక్కోలు బుక్‌ ట్రస్టుకు చెందిన రచయిత, వక్త దుప్పల రవికుమార్‌, రాజాం రచయితల సంఘానికి చెందిన రచయిత పొదిలాపు శ్రీనివాసరావు మాట్లాడుతూ కారామాస్టారి సాహిత్యాన్ని, వ్యక్తిత్వాన్ని, నిబద్ధతను వివరించారు. రచయిత, కథకుడు, విమర్శకుడైన కారా మాస్టారు రచనలశైలి సరళంగా ఉంటుందన్నారు. ఆయనరాసిన యజ్ఞం ఆధునిక తెలుగు సాహిత్యంలో కన్యాశుల్కంతో సమానమైనదన్నారు. కారా భౌతికంగా లేకపోయినా ఆయన కథలు, రచనలు, ఆయన ఏర్పాటుచేసిన కథానిలయం చిరకాలం ఉంటాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాల్లోని మురపాకలో పుట్టి విశాఖలో లెక్కల మాస్టారుగా పనిచేసిన కారామాస్టారు సాహితీ ప్రపంచంలో అందరికీ మాస్టారని తెలిపారు. కార్యక్రమంలో రచయితలు శాంతి, కుమార్‌ వర్మ, జగదీష్‌, పక్కి రవీంద్ర, స్వామి నాయుడు, చిన్నంనాయుడు, సోమేశ్వర రావు, గణపతిరావు, రంజిత్‌ కుమార్‌, సత్యనారాయణ, గోవింద, బూరి ఇళ్ళంనాయుడు, పాలకొండ రామలింగ స్వామి, పిల్లా లక్షున్నాయుడు, పిల్లా తిరుపతిరావు తదితరులతో పాటు శ్రీకాకుళం సాహితీ అరసం, సాహితీలహరి, జనవిజ్ఞాన వేదిక, స్నేహకళాసాహితీలకు చెందిన కవులు, రచయితలు, సాహితీవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన కథలు, సాహిత్యం గురించి వివరించారు.

➡️