సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్‌రెడ్డి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సిఎం జగన్‌ తన సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని టిడిపి యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధుల కొరతే కారణం గాని, ఎన్నికల కమిషన్‌, తెలుగుదేశం పార్టీ కాదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇంటి వద్దే ఫించన్లు పంపిణీ చేయాలని జగన్‌రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదని ప్రశ్నించారు. 1.35 లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్ధప్రాతిపదికన ఫించన్లు ఇంటి వద్దే పంపిణీ చేయడం సాధ్యమన్నారు. జగన్‌రెడ్డి స్వార్థ రాజకీయం వల్లే ఫించన్‌దారులు, వాలంటీర్లు నష్టపోతున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు రూ.4,000 పింఛన్‌ అందిస్తామన్నారు. ఫించన్లు సకాలంలో ఇళ్ల వద్దనే పంపిణీ చేయకపోతే సీఎస్‌ జవహర్‌రెడ్డి, సెర్చ్‌ సీఈవో మురళీధర్‌రెడ్డి, సీఎం జగన్మోహన్‌రెడ్డిపై ఎన్నికల కమిషన్‌ తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకటో తారీఖున పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బును, జనవరి 23న బటన్‌ నొక్కిన ఆసరా డబ్బును, ఫిబ్రవరి 16న బటన్‌ నొక్కిన చేయూత డబ్బును, ఫిబ్రవరి 29న పామర్రులో బటన్‌ నొక్కిన విద్యా దీవెన డబ్బును, మార్చి 14న బటన్‌ నొక్కిన ఈబీసీ నేస్తం డబ్బును, ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన నిధులు రూ.13 వేల కోట్లు, మార్చి 16 నుంచి 30వ తేదీ లోపల అంటే 15 రోజుల్లోనే జగన్‌రెడ్డి తన అనుకూల కాంట్రాక్టర్లకు మొత్తం దోచిపెట్టాడని ఆరోపించారు. దీంతో పింఛన్ల సొమ్ములు ఇవ్వడానికి ఖజానాలో సరిపడా నిధులు లేవని చెప్పారు. వాలంటీర్లు ప్రజా సేవా కార్యక్రమాలకు కాకుండా జగన్‌రెడ్డి వారిని వైసీపీ కార్యక్రమాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేశాడని చెప్పారు. వాలంటీర్లు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించే విధంగా చేసి వందల మందిని సస్పెన్షన్లకు, వారిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు జగన్‌రెడ్డి కారకుడయ్యాడన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సెర్చ్‌ సీఈవో మురళీధర్‌రెడ్డి ఫించన్ల పంపిణీని సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ చేకూరి సుబ్బారావు, నాయకులు వేగినాటి శ్రీనివాస్‌, కంచర్ల సత్యనారాయణగౌడ్‌, మంత్రూనాయక్‌, చిట్టేల వెంగళరెడ్డి, ఒంగోలు ఆదిరెడ్డి, జనసేన మండల కార్యదర్శి ఆకుల రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️