హార్సిలీహిల్స్‌లో భూమిని కేటాయించొద్దు- జెసికి అఖిలపక్ష నాయకుల వినతి

ప్రజాశక్తి-మదనపల్లి హార్సిలీహిల్స్‌లో యాత్ర-2 సినిమా డైరెక్టర్‌కు రెండు ఎకరాల భూమిని కేటాయించొద్దని జాయింట్‌ కలెక్టర్‌ను అఖిలపక్ష నాయకులు కలిసి వినతపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మురళి, టిడిపి బిసి సెల్‌ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్‌, జై భీమ్‌ భారత్‌ పార్టీ నాయకులు కొన భాస్కర్‌ మాట్లాడుతూ హార్సిలీ హిల్స్‌లో ఇప్పటికే ఆ భూమిని క్రీడా శిక్షణ కోసం కేటాయించారని, అలాంటి ప్రభుత్వ విలువైన భూములను ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం చూడటం సరికాదని అన్నారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వ భూములు పంచిపెడితే ఊరుకోమని, కచ్చితంగా అడ్డుకుంటామని పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు హార్సిలీ హిల్స్‌ వెళ్లి అక్కడ భూమిని పరిశీలించి హడావిడి చేశారని, అధికారులను అడిగితే మాకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారని చెప్పారు. అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు లేకుంటే ఏవిధంగా భూమి పరిశీలన చేస్తారని ప్రశ్నించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ మాకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవని, ఆభూమి కేవలం క్రీడా శిక్షణ కోసం కేటాయించారని అందుకే ఉపయోగించాలని, సినిమ డైరెక్టర్లకు ఎందుకు కేటాయి స్తామని అలాంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దని అన్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాపతి, రాజారెడ్డి, వెంకటేష్‌, సదాశివ పాల్గొన్నారు.

➡️