అంగనవాడీల నిర్బంధం

ప్రజాశక్తి-నిమ్మనపల్లి(అన్నమయ్యజిల్లా) : తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత కొద్ది రోజులుగా పోరాడుతున్న అంగనవాడి కార్యకర్తలు, బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు.. ఈ క్రమంలో నిమ్మనపల్లి మండలం నుంచి 36 మంది అంగనవాడి కార్యకర్తలు మూడు వాహనాల్లో కలెక్టరేట్‌కు బయలుదేరగా.. మార్గమధ్యంలోనే కదిరాయి చెరువు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని నిమ్మనపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అంగనవాడీలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోగా మాపై నిరంకుశ వైఖరితో ప్రవర్తిస్తున్నాదని, ఇప్పటికైనా అంగనవాడీ కార్యకర్తల శ్రమను, సేవలను ప్రభుత్వం గుర్తించి తమ న్యాయమైన డిమాండ్లను కచ్చితంగా నెరవేర్చాలని అన్నారు. అంగన్వాడీల గోడును పట్టించుకోకపోగా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల చేత అంగనవాడి కేంద్రాలను తెరిపించి నిర్వహిస్తున్నారని, అంగనవాడి కేంద్రాలలోని ముఖ్యమైన రికార్డులు, వస్తువులు తారుమారైతే ఆ బాధ్యత అక్కడ విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లదేనని అన్నారు. ప్రభుత్వం నిరంకుషత్వ వైఖరిని విడిచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని ఇలాగే ముందుకు తీసుకుపోతామని అన్నారు.

➡️