అంగన్వాడీలకు ఇచ్చే జీతాలనే మంత్రులూ తీసుకోవాలి

నరసరావుపేటలో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి – చిలకలూరిపేట, యడ్లపాడు : అంగన్వాడీలకు ఇస్తున్న జీతాలనే మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని, వాటితో ఎలా బతకాలో చెప్పాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 29వ రోజుకు చేరింది. పట్టణంలోని గ్రంథాలయం వద్ద సమ్మె శిబిరాన్ని రమాదేవి మంగళవారం సందర్శించి సంఘీభావంగా మాట్లాడారు. అంగన్వాడీలు ఎంతో ధైర్యంగా పోరాడుతున్నారని, ప్రతి కార్యకార్త ఆదర్శవంతమైన మహిళేనని అభినందించారు. ఇలాంటి పోరాటాన్ని ఎస్మా వంటి చట్టాలు ఆపలేవని, ఇదే విషయాన్ని పాలకులు గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలని, లేకుంటే సమ్మె మరింత తీవ్రతరం అవుతుందని, వివిధ పార్టీలు, ప్రజా సంఘాలూ కలిసొస్తాయని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.రాధాకృష్ణ మద్దతుగా మాట్లాడుతూ అంగన్వాడీలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, ఇకమీదట పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పారు. అనంతరం సిఐటియు సీనియర్‌ నాయకులు పి.సుబ్బారావు, మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు, యూనియన్‌ సెక్టార్‌ అధ్యక్షులు జి.సావిత్రి మాట్లాడారు. సమ్మెకు పల్నాడు జిల్లా ప్రైవేటు టీచర్స్‌ అండ్‌ లెక్చరర్ల ఫెడరేషన్‌, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు కె.చిన్నబాబు మద్దతు తెలిపారు. సమ్మె సందర్భంగా దీక్షల్లో కూర్చున్న వారికి స్వీట్లు పంచి పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా జైల్‌భరో సందర్భంగా అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని అంగన్వాడీలు డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు. మండల కేంద్రమైన యడ్లపాడులో అంగన్వాడీలు ప్రధాన రహదారిపై మానవహారం చేపట్టగా మద్దతుగా రమాదేవి మాట్లాడారు. అంగన్వాడీ సేవలు ఎస్మా చట్ట పరిధిలోకి రావని చెప్పారు. సిపిఎం మండల కన్వీనర్‌ టి.కోటేశ్వరరావు, సీనియర్‌ నాయకులు పి.సుబ్బారావు మద్దతు తెలిపారు. అంగన్వాడీ నాయకులు ఎం.అరుణ, ఇ.పరిమళ, ఎస్‌.సరోజిని, కె.బంగారి, పి.రాజ్యలకీë పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ఈపూరు : స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద సమ్మె శిబిరాన్ని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు సందర్శించి అంగన్వాడీలకు సంఘీభావంగా మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, హామీలను విస్మరించిందని మండిపడ్డారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా సిఐటియు అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, మండల నాయకులు ఎం.దేవసహాయం, టిడిపి నాయకులు ఆర్‌.జగ్గారావు, ఎం.శివప్రసాద్‌, ఎ.కోటేశ్వరరావు, బి.సైదులు, ఎ.శ్రీను పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పల్నాడు : జిల్లా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని గాంధీ పార్క్‌ వద్ద ధర్నా చౌక్‌లో అంగన్వాడీల సమ్మె శిబిరం కొనసాగుతోంది. పలువురు అంగన్వాడీలు దీక్షలు చేపట్టగా వారికి యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మల్లేశ్వరి పూలమాలవేసి దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో ఎన్నోసార్లు విద్యుత్‌, బస్సు, రైల్వే, నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయని, అయితే అంగన్వాడీల వేతనాలు మాత్రం ఒక్కసారి తూతూమంత్రంగా పెంచారని చెప్పారు. ఎస్మాను ప్రయోగించిన ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగులుగా కనీస వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి మాట్లాడుతూ గతంలో ఎస్మాను ప్రయోగించిన అనేక ప్రభుత్వాలు భూస్థాపితం అయ్యాయని, అదే జాబితాలోకి వైసిపి చేరబోతుందని హెచ్చరించారు. బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసినా భయపడేది లేదని, డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకూ సమ్మె కొనసాగుతుందని, వారికి అండగా ప్రజా సంఘాలుంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్డాదేవి, నాయకులు నిర్మల, మాధవి, కవిత, సాయి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎస్మా చట్టం ప్రయోగానికి వ్యతిరేకంగా రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష నాయకులను పోలీసులు స్టేషన్‌కు తరలించడాన్ని నిరసిస్తూ శిబిరం ఎదుట రోడ్డుపై అంగన్వాడీలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.
ప్రజాశక్తి – వినుకొండ : స్థానిక సురేష్‌ మహల్‌ రోడ్డులోని అంగన్వాడీల సమ్మె శిబిరం కొనసాగుతోంది. నిరసనలో భాగంగా అంగన్వాడీలు చెవులో పువ్వుతో నిరసన తెలిపారు. మాజీ ఎంపిపి ఎల్‌.వెంకట్రావు, గంగినేని ఫౌండేషన్‌ చైర్మన్‌ జి.రాఘవ, సిహెచ్‌.ఏడుకొండలు, ఆదిలక్ష్మి, కె.బాలరాజు, విశ్రాంత ఎంఇఒ జాన్‌సుందర్‌రావు, ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వి.చంద్రమౌళి, షరీఫ్‌, శ్రీనివాసరావు, గురుబాబు, మహమ్మద్‌ ఖాన్‌ తదితరులు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. విజయం సాధించే వరకూ పోరాడాలని, తామూ అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ప్రసన్న లక్ష్మి, బి.శ్రీదేవి, జి.పద్మ, కృష్ణకుమారి, పి.ఉమశంకరి, నిర్మల, నాగజ్యోతి, గాయత్రి, డి.బీబూలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలో సమ్మె శిబిరం కొనసాగుతోంది. యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ హాజర, డి.శాంతమణి మాట్లాడారు. రామలక్ష్మి, బుజ్జి, సుజాత, రమణ, ఆషా, సఫీయా పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మాచర్ల : సమ్మె శిబిరాన్ని కెసిపి ఉద్యోగులు సందర్శించి మద్దతు తెలిపారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. యూనియన్‌ నాయకులు ఉషారాణి, ఇందిర, కాకర్ల పద్మావతి, శాంతలత, కోటేశ్వరి, సుందరలీల, శారద, దుర్గా శివలక్ష్మీ, రుక్మిణి, జయలక్ష్మీ, శివపార్వతీ, లీలావతి, వెంకటరమణ, సైదమ్మ, చిలకమ్మ, మల్లేశ్వరి, కెసిపి ఉద్యోగులు బి.మహేష్‌, వై.సురేష్‌, శోభన్‌కుమార్‌, వెంకటరత్నం, బి.శ్రీను, పవర్‌ గ్రిడ్‌ కార్మికులు రమణరెడ్డి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : సమ్మె శిబిరం కొనసాగింది. సిఐటియు మండల కార్యదర్శి పి.మహేష్‌ మాట్లాడారు. నాడు అక్కయ్య, చెల్లెమ్మ, పెద్దమ్మ అని పిలిచినా ఆప్యాయతలు నేడు ఏమయ్యాయని పలువురు అంగన్వాడీలు ప్రశ్నించారు. సమ్మె విరమించాలని సిఎం దండం పెట్టి చెబితే తాము లక్ష దండాలు పెట్టి కనీకం చూపించాలని అడుగుతున్నామని అన్నారు. ఇదిలా ఉండగా అంగన్వాడీలు రాస్తారోకో చేస్తారేమోనని శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కార్యక్రమంలో నాయకులు రాజకుమార్‌, సుజాత, అహల్య, చాముండేశ్వరి, ధనలక్ష్మి, దుర్గాభవాని, జ్యోతి పాల్గొన్నారు.

➡️