అంగన్‌వాడీల పోరుబాట

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు అంగన్‌వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతుందని సిఐటియు బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్‌ గంగయ్య అన్నారు. మంగళవారం మార్టూరు తహశీల్దారు కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా నాయకులు బత్తుల హనుమంతరావు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన దీక్షలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. అంగన్‌ వాడీలకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీని అమలు చేయాలని, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు రూ.5 లక్షలకు పెంచి వేతనంలో సగం పెన్షన్‌గా ఇవ్వాలని, హెల్పర్‌ ప్రమోషన్లకు నిబంధనలు రూపొందించాలని, సర్వీస్‌లో ఉండి చనిపోయినవారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రిటైర్‌మెంట్‌ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, నిలిచిపోయిన సూపర్‌వైజర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తదితర న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గంగయ్య డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్ఫేర్‌ యూనియన్‌ నాయకులు తాళ్లూరి రాణి, పల్లెపోగు శ్యామల, రాజేశ్వరి, శాంతి, విజయలక్ష్మి మండల పరిధిలోని అంగన్‌ వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు. పంగులూరు: అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకై అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఇచ్చిన పిలుపులో భాగంగా, మంగళవారం పంగులూరు లోని తహశీల్దారు కార్యాలయం ముందు అంగన్‌వాడీలు ధర్నా చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరవధిక సమ్మె చేస్తామని అంగన్‌వాడీలు నినదించారు. తొలుత ఈ సమస్యలపై నినాదాలు చేస్తూ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గుడిపాటి మల్లారెడ్డి, అంగన్‌వాడీలు డి స్వర్ణలత, కల్పన, వరలక్ష్మి, ఆర్‌ ఇందిర, మాధవి, ప్రసన్న, సుజాత, శారద, రజిని, అనూష తదితరులు పాల్గొన్నారు.

➡️