అంగన్‌వాడీల సమ్మె ఉధృతం

ప్రజాశక్తి – యంత్రాంగం

అంగన్‌వాడీల సమ్మె రెండో రోజు బుధవారం ఉధృతంగా సాగింది. జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీలు, హెల్పర్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల కళ్లు మూసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. అలాగే నిరసన ప్రదర్శనలు, మానవహారాలు చేపట్టారు. పలుచోట్ల అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులకొట్టి కొత్తతాళాలు వేయడంపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు టిడిపి, జనసేన పార్టీలతో పాటు వివిధ కార్మిక, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు. ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించడం చేతగాని ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ విమర్శించారు. అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారానికి రెండో రోజుకు చేరింది. ఏలూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి ప్రసాద్‌ మాట్లాడుతూ ఏడాది కాలంగా పలుమార్లు ప్రభుత్వానికి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరినా జగన్‌ ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సమ్మె చేపట్టారన్నారు. యూనియన్‌తో చర్చించి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం అత్యంత ఆప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందన్నారు. జిల్లాలో అనేకచోట్ల అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగులకొట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు సిఎం జగన్‌ అంగన్‌వాడీలకు తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని హామీ ఇచ్చారని, నాలుగున్నరేళ్లు గడిచినప్పటికీ ఆ హామీ అమలు చేయలేదని విమర్శించారు. పైగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ల పేరుతో పనిభారం పెంచారన్నారు. సెంటర్‌ అద్దెలు, గాస్‌ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదన్నారు. నెలల తరబడి బకాయిలుంటే కేంద్రాలను ఎలా నడుపుతారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకూ ఒక్క రూపాయి జీతం పెంచలేదని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు టి.రజని, కార్యదర్శి దుర్గాభవాని, సిఐటియు నగర అధ్యక్షులు బి.జగన్నాధరావు, కార్యదర్శి వి.సాయిబాబు పాల్గొన్నారు. ఈ సమ్మెకు బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి నారపల్లి రమణ, యుటిఎఫ్‌ నాయకులు పివి.నరసింహారావు, టిడిపి నాయకులు బడేటి చంటి, జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ద్వారకాతిరుమల : అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ అన్నారు. ద్వారకాతిరుమలలో అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిందిపోయి అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం వంటి చర్యలకు పూనుకోవడం నిరంకుశత్వమన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు మాట్లాడుతూ తాళాలు పగులకొట్టాలని కలెక్టర్‌ సైతం ఆదేశించడం చట్టవిరుద్ధమన్నారు. చట్టాలను కాపాడాల్సిన అధికారులే చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించడం దారుణమన్నారు. సమ్మెకు యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు సంఘీభావం తెలిపారు. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్‌రావు, విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షులు బ్రహ్మాజీ మద్దతు తెలిపారు.జంగారెడ్డిగూడెం : అంగన్‌వాడీల సమ్మె రెండో రోజూ కొనసాగింది. సమ్మె శిబిరాన్ని బుధవారం సిపిఎం నాయకులు పి.సూర్యారావు, ప్రారంభించారు. సమ్మెకు సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం, టిడిపి నాయకులు సాయల సత్యనారాయణ, అనపరెడ్డి గంగాధర్‌రావు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌ చంద్రశేషు మద్దతు తెలిపారు. సిఐటియు నాయకులు బర్రె బాలరాజు, పొన్నూరు నాగరాజు, గొర్ణం వెంకటేష్‌, జి.లక్ష్మణ్‌, ఏలేటి శ్రీను, గొల్లమందల శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం నుండి బస్టాండు వరకూ ర్యాలీ నిర్వహించారు. బస్టాండు వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు నాయకులు జి.విమల, లక్ష్మీదేవి, శాంతి, శిరోమణి, సుబ్బయ్య కుమారి పాల్గొన్నారు. చింతలపూడి : అంగన్‌వాడీల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని జనసేన చింతలపూడి కన్వీనర్‌ మేకా ఈశ్వరయ్య, ఐటిడిపి నియోజకవర్గ కన్వీనర్‌ బోడా అవినాష్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌విఎస్‌.సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ చేపట్టి జిబిజి రోడ్డు వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యునియన్‌ జిల్లా కార్యదర్శి మణి, సరోజని, సరళ, సిఐటియు, ఎఐటియుసి నాయకులు పాల్గొన్నారు.జీలుగుమిల్లి : అంగన్‌వాడీల సమ్మె రెండో రోజూ కొనసాగింది. విధులను బహిష్కరించి అంగన్‌వాడీలు సమ్మెలో పాల్గొన్నారు. సిపిఎం, టిడిపి, యుటిఎఫ్‌, సిఐటియు మద్దతు తెలిపాయి. అనంతరం ఎంపిడిఒ కృష్ణప్రసాద్‌కు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకురాలు మేఘలాదేవి, యుటిఎఫ్‌ నాయకులు అల్లాడి రాజు, పోసమ్మ, సిఐటియు నాయకులు కొండలరావు, నిర్మల, అంగన్‌వాడీల యూనియన్‌ నాయకులు నాగమణి, ఎస్తేరు పాల్గొన్నారు.ముసునూరు : అంగన్‌వాడిల న్యాయమైన డిమాండ్ల్‌ను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా నాయకులు జి.రాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె రెండో రోజు ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు పల్లిపాము విజయకుమారి, పి.దుర్గమ్మ, మేరి సులోచలన, విద్యావతి, కళావతి పాల్గొన్నారు.పోలవరం : అంగన్‌వాడీల సమ్మెకు సిపిఎం, టిడిపి నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ మద్దతు తెలిపారు. సిపిఎం పోలవరం మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు మాట్లాడుతూ గర్భిణులకు, చిన్నారులకు ఎన్నోసేవలందిస్తున్న అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందన్నారు. కనీస వేతనాలు, ప్రమోషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పిఎల్‌ఎస్‌.కుమారి, సిఐటియు జిల్లా కార్యదర్శి పి.భారతి, సిపిఎం మండల కమిటీ సభ్యులు బోరగం భూ చందర్రావు, మడివి చలపతి, సముద్రాల సాయికృష్ణ, టిడిపి మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ, రైతు నాయకులు కుంచె దొరబాబు పాల్గొన్నారు.మండవల్లి : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం విరమించేది లేదని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మె రెండోరోజుకు చేరింది. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన సెంటర్లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందించారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు సమ్మె చేపడుతుంటే అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి నిర్వహించాలని చూడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పులపర్రు-1,2 మణుగూరు-1, కోవాడలంక-1,2, కాకతీయ నగర్‌-1 అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి వేరేతాళాలు వేయడంపై వారు మండిపడ్డారు. కేంద్రాల తాళాలు పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల యూనియన్‌ నాయకులు చెల్లాయమ్మ, విజయలక్ష్మి, ఉమాదేవి పాల్గొన్నారు నిడమర్రు : అంగన్‌వాడీల సమ్మె రెండో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకురాలు కోన జయమ్మ, ప్రేమలత మాట్లాడారు. అనంతరం ప్రదర్శన చేపట్టి సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసిన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు, యూనియన్‌ నాయకులు పార్వతి, నాగమణి, నాగేశ్వరి, ధనలక్ష్మి, త్రివేణి నాయకత్వం వహించారు.ఆగిరిపల్లి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె రెండో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపిడిఒ పి.శంకర్‌రావుకు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు అన్నమ్మ, అనురాధ, పుల్లమ్మ, కరుణ, రూప, జ్యోతి, ప్రజాసంఘాల నాయకులు చాకిరి శివనాగరాజు, సత్తు కోటేశ్వరరావు, ముత్యాల నరేష్‌ పాల్గొన్నారు.కొయ్యలగూడెం : అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్ల బోయిన రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రెండో రోజు సమ్మెలో ఆయన మాట్లాడారు. సమ్మెకు కొయ్యలగూడెం టిడిపి నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షులు శివరత్నకుమారి, జె.నాగమణి, ఎం.మాధవి, సిహెచ్‌.పద్మ, కె.జ్యోతి, శ్రీలత, టిడిపి నాయకులు పారేపల్లి రాంబాబు, రామకృష్ణ, చింతల వెంకటరమణ పాల్గొన్నారు.టి.నరసాపురం : అంగన్‌వాడీల సమ్మె రెండో రోజు సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయం నుండి సొసైటీ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్‌ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. మండలంలోని 66 అంగన్‌వాడీ సెంటర్లను మూసివేసి సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెకు సిఐటియు జిల్లా నాయకులు ఆర్‌విఎస్‌.నారాయణ, నత్తా వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. రైతు సంఘం జిల్లా నాయకులు ఎ.మురళీ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు బి.పనివర్థిని, ఎన్‌.మార్తమ్మ, ఎం.సత్యవతి, కె.బాబి, జి.రామదుర్గ, బి.అచ్చలమ్మ పాల్గొన్నారు.పెదవేగి : అంగన్‌వాడీల సమ్మెకు దెందులూరు మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌ మద్దతు తెలిపారు. పెదవేగిలో సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. అంగన్‌వాడీలు తలచుకుంటే ప్రభుత్వాలనే కూల్చేస్తారన్నారు. తక్షణం వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తాతా సత్యనారాయణ, సిపిఎం నాయకులు కె.శ్రీనివాస్‌, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారుముదినేపల్లి : అంగన్‌వాడీల సమ్మె రెండో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి బేతాళరావు, నాయకులు దుర్గాప్రసాద్‌, సాయిలక్ష్మి తదితర నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. కలిదిండి : ఎంపిడిఒ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి శేషపు మహంకాళిరావు, సిఐటియు మండల కార్యదర్శి జక్కుల మహేష్‌, ఉపాధ్యక్షులు చిన్నం శ్రీకాంత్‌, అంగన్‌వాడీల యూనియన్‌ నాయకులు షేక్‌ అబిదా బేగం, జక్కంశెట్టి మేనకలక్ష్మి, కొప్పినీడి రమాదేవి పాల్గొన్నారు. మాజీ ఎంపీ, టిడిపి నేత మాగంటి బాబు, మాజీ ఎంఎల్‌సి కమ్మిలి విఠల్‌, జనసేన నియోజకవర్గ నాయకులు కొల్లి వరప్రసాద్‌ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.చాట్రాయి : అంగన్‌వాడీల సమ్మె రెండో రోజూ కొనసాగింది. సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చాగంటి రాజారావు మద్దతు తెలిపారు. భీమడోలు : అంగన్‌వాడీలు రెండో రోజు సమ్మెలో వినత్నంగా నిరసన తెలిపారు. స్థానిక సాయిబాబా గుడి సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో అంగన్‌వాడీలు కళ్లు మూసుకుని నిరసన తెలిపారు. ఈ శిబిరాన్ని సందర్శించిన సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాలతో మండలస్థాయి అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు ఇవ్వాలని బాధ్యులను అడగడంతో వారు నిరాకరించారని తెలిపారు. తాళాలు ఇవ్వకుంటే కేంద్రాలను బలవంతంగా తీసి నిర్వహిస్తామని, సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం అన్యాయమన్నారు. మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది సహకారంతో సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. న్యాయబద్ధమైన వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారితో చర్చించాలని కోరారు. ఈ సమ్మెకు టిడిపి, వివిధ కార్మిక, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఉంగుటూరు : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని టిడిపి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంఎల్‌ఎ గన్ని వీరాంజనేయులు అన్నారు. అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని గన్నితో పాటు పార్టీ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.

➡️