ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
29 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్న అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమ్మె 29వ రోజు మంగళవారం జిల్లాకేంద్రమైన ఏలూరులో కదంతొక్కారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా స్థానిక కలెక్టరేట్ నుండి భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో బైఠాయించారు. వీరికి వివిధ కార్మిక, ప్రజా సంఘాలు, రాజకీయపక్షాలు మద్దతుగా నిలిచాయి. రెండుగంటలకు పైగా ఆందోళన చేపట్టారు. దీంతో ఫైర్ స్టేషన్ సెంటర్‌లో ట్రాఫిక్ స్తంభించించింది. టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడేటి రాధాకృష్ణ(చంటి), జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు, చోడే వెంకటరత్నం తదితరులు మద్దతు ప్రకటించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అంగన్వాడీల యూనియన్ జిల్లా కార్యదర్శి పి.భారతి అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అంగన్వాడీల సమస్యను జఠిలం చేస్తుందని విమర్శించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బెదిరింపు ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. వేతనాలు పెంచే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉభయగోదావరి జిల్లాల ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీల పోరాటం రాష్ట్ర ఉద్యమాల చరిత్రలోనే రికార్డు సృష్టించబోతోందన్నారు. వైసిపి ప్రభుత్వం కార్మిక, మహిళల వ్యతిరేక ప్రభుత్వంగా నిరూపించుకుంటుందన్నారు. ఎస్మా చట్టం అంగన్వాడీలను ఏమీ చేయలేదని మనోధైర్యం నింపారు. తక్షణం వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాడాలని పిడిఎఫ్ ఎంఎల్‌సిలుగా తామంతా సంపూర్ణ మద్దతిస్తున్నామని, చివర వరకూ తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారపల్లి రమణారావు, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోసమ్మ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మోడియం నాగమణి, విఒఎల సంఘం జిల్లా కార్యదర్శి సుభాషిణి, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జె.గోపి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు, వి.సాయిబాబు, కె.విజయలక్ష్మి, బి.భవాని, పుష్ప, రమాదేవి, తులసి పాల్గొన్నారు.అంగన్వాడీకి అస్వస్థతస్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో బైఠాయించి నిరసన తెలియజేస్తున్న సమయంలో ఏలూరు సత్యన్నారాయణ కాలనీకి చెందిన అంగన్వాడీ కార్యకర్త బేబీ చిన్నారి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తోటి కార్యకర్తలు ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.