నైపుణ్యాన్ని వెలికితీసేందుకు అవకాశం : కేంద్ర మాజీమంత్రి అశోక్
గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికి దోహదం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి-విజయనగరంకోట : అఖిలభారత డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన (సరస్) ప్రారంభమయ్యింది. పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, విజయనగర ఉత్సవాలను పురస్కరించుకొని, స్థానిక పెద్దచెరువు రోడ్డులోని మాన్సాస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ఛైర్మన్ పూసపాటి అశోక్‌గజపతిరాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో మొత్తం 254 స్టాల్స్ ఏర్పాటు చేసి, మన , రాష్ట్రంతోపాటు 18 రాష్ట్రాలకు చెందిన డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఆహార పదార్ధాలు, తినుబండారాలు, వస్త్రాలు, వివిధ రకాల కలంకారీ వస్తువులు, ఆయుర్వేద ఉత్పత్తులు, గృహోపకరాణాలు, మహిళా సంఘాలు సృజనాత్మకతతో సష్ఠించిన కళాకతులను విక్రయానికి ఉంచారు. ఈ ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం అశోక్‌గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ మహిళల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు సైతం గౌరవప్రదంగా తమ జీవనాన్ని సాగించేందుకు, వారి ఆర్థికాభివద్దికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మహిళలు తయారు చేసే కళాకతులు, వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శనకు ఇలాంటి ప్రదర్శనలు వేదికగా నిలుస్తున్నాయని, దీనిని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మైసూరు ఉత్సవాల తరహాలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు.
రాష్ట్ర ఎంఎస్‌ఎంఇ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో పేదరికాన్ని తగ్గించేందుకు, మహిళల ఆర్థికాభివృద్దికి డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శనలు దోహదం చేస్తాయని అన్నారు. ఇలాంటి ప్రదర్శనను శాశ్వతంగా నిర్వహించేందుకు అమరావతిలో పది ఎకరాలను కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళల చేతి నైపుణ్యంతో రూపొందించిన ఎన్నో వస్తువులు, కళాకతులు, వస్త్రాలను ఈ డ్వాక్రా ప్రదర్శనలో ఉంచారని, వీటిని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సెర్ప్ సిఇఒ వీర పాండ్యన్, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, నాబార్డ్ సిజిఎం కెవిఎస్ ప్రసాద్, డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి, జెడ్‌పి సిఇఒ బివి సత్యనారాయణ, సిపిఒ పి.మురళి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, నాబార్డ్ డిడి నాగార్జున, వివిధ శాఖల అధికారులు, డిఆర్‌డిఎ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు పాలవలస యశస్విని, కొండపల్లి కొండలరావు, ఐవిపి రాజు, బొద్దల నర్సింగరావు, అవనాపు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.