ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఓటర్ల జాబితా తయారీ అత్యంత పారదర్శకంగా జరగాలని, దొంగ ఓట్లను, మృతి చెందిన వారి ఓట్లను తొలగించాలని ఎలక్టోరల్ అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పల్నాడు జిల్లా పరిశీలకులు బి.శ్రీధర్ ఆదేశించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పందన హాల్లో రాజకీయ పార్టీలు, అధికారులతో శనివారం సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్, డిఆర్‌ఒ వినాయకం పాల్గొన్నారు. ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీలకున్న సందేహాలను అడిగి తెలుసుకుని నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్ విలేకర్లతో మాట్లాడారు. సమీక్షలో రాజకీయ పార్టీల నాయకులు వారి నియోజకవర్గాల పరిధిలోని సమస్యలను వివరించారని, వారి నుండి ఎలక్టోరల్ అబ్జర్వర్ వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి ఆదేశించారని చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, ఈ మేరకు ఇఆర్వోలు, ఎఇఆర్వోలకు ఆదేశాలిచ్చామని చెప్పారు. ఇప్పటివరకు పరిష్కరించిన సమస్యలను, పరిష్కరించాల్సిన సమస్యలను మీడియాకు వివరించారు.ఇదిలా ఉండగా పల్నాడు జిల్లాలో ఓట్ల నమోదు మార్పులు చేర్పుల్లో భారీ అవతవకలు జరిగాయని ఎన్నికల సంఘం అధికారి వద్ద టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు జూలకంటి బ్రహ్మారెడ్డి, డాక్టర్ చదలవాడ అరవిందబాబు తదితరులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులపై ఎలక్టోరల్ అబ్జర్వర్ అయిన శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.పల్నాడు జిల్లాలో ఓటర్ల జాబితా తయారీలో భారీ అవకతవకలున్నాయని కలెక్టర్‌కు టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. టిడిపి జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు, మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి, నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం విలేకర్లతో జివి ఆంజనేయులు మాట్లాడుతూ బిఎల్‌ఒలపై వైసిపి నేతలు ఒత్తిడి చేసి టిడిపి సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని అన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శావల్యాపురం మండలం మతుకుమల్లిలో 40 మంది ఓట్లు తొలగించారని, దీనిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశామని అన్నారు. వైసిపి నేతలు భారీ ఎత్తున ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసిపి నేతలు ఫిర్యాదు ఇవ్వగానే విచారణేమీ లేకుండా వెంటనే ఓట్లను తొలగిస్తున్న అధికారులు తమ ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. వెల్లటూరులో వైసిపి నేతలు 160 దొంగ ఓట్లను చేర్చారన్నారు. తప్పలు చేసిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూతన జాబితాలో అన్యాయం జరిగితే న్యాయ పోరాటం చేస్తామన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా విషయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఓట్ల నమోదు, మార్పులు, చేర్పుల విషయంలో అధికారులు న్యాయంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ ఆరు నెలలుగా దొంగ ఓట్లపై ఆధారాలు చూపుతున్నా అధికారులు స్పందించడం లేదని, వైసిపి ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఓటర్ జాబితా తయారవుతోందని అన్నారు. నిన్న ఉన్న ఓటు ఈ రోజు ఉంటుందో లేదో అర్థం కావడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎల్.వెంకట్రావు, ఎం.సుబ్బారావు, జి.జనార్థన్‌బాబు, బి.విశ్వేశ్వరరావు, పి.వెంకట కోటయ్య, జి.శేఖర్, కె.కోటిరెడ్డి, కె.శివారెడ్డి, సిహెచ్.గంగయ్య పాల్గొన్నారు.ఓటర్ల జాబితా ప్రత్యేక సారాంశ సవరణ-2024పై ఇఆర్వోలు, ఎఇఆర్వోలతో ఎస్‌ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమీక్షించారు. రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాలపై కులంకుషంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసిన వారిపై పోలీసులతో సమగ్ర విచారణ జరిపిన అనంతరం అవసరమైతే వారి మీద సెక్షన్ 31 కింద కేసులు నమోదు చేసేలా చూడాలన్నారు. శాశ్వత వలసలు, తాత్కాలిక వలసలు, డబుల్ ఎంట్రీలపై అవసరమైన వారికి నోటీసులిచ్చి తగనగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన వారి ఓట్లు తొలగింపు విషయంలో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన వారిపై ప్రాస్పెక్టివ్ ఓటర్ నమోదు ప్రక్రియను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు సంబంధించిన విధులను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.
