ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణానికి చెందిన అరుణోదయ ఐఐటీ ఫౌండేషన్ స్కూల్, శర్వాణి విద్యానికేతన్ సంస్థల ఆధ్వర్యంలో స్థానిక సీతారామ కల్యాణ మండపంలో 28వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ జి చంద్రశేఖరరావు, మండల విద్యాశాఖాధికారి కావడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జి చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ అరుణోదయ పాఠశాల అంటే క్రమశిక్షణకు మారుపేరు అని, అరుణోదయ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నత స్థాయిలో వున్నారని అన్నారు. మండల విద్యాశాఖాధికారి కావడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, అప్పుడే విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించ వచ్చన్నారు. పాఠశాల కరస్పాండెంట్ జడ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్న తికి తాము అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గురుప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
