ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

ప్రజాశక్తి-మార్కాపురం: పొదుపు మహిళలకు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మార్కాపురం నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు అన్నారు. మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయ ఆవరణలో నాలుగో విడత ఆసరా సంబరాల్లో రాంబాబు ముఖ్య అతిథిగా మాట్లాడారు. మహిళలకు సిఎం జగన్‌ పెద్దపీట వేశారన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చేందేలా చర్యలు తీసుకున్నారన్నారు. పొదుపు మహిళల రుణాలు నాలుగు విడతల్లో రద్దు చేసి మాట నిలుపుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు జగన్‌ను, తమను ఆశీర్వదించాలని కోరారు. చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెబుతారని, ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం మండలానికి సంబంధించిన నాలుగో విడతగా రూ.5.27 కోట్ల రుణాల రద్దుకు సంబంధించిన వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కులను మహిళలకు అందించారు. ఈ కార్యక్రమానికి డిఆర్‌డిఎ వైకెపి ఎపిఎం రమేష్‌బాబు అధ్యక్షత వహించగా ఎంపిపి పోరెడ్డి అరుణా చెంచిరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ మీర్జా షంషీర్‌ అలీబేగ్‌, సూక్ష్మ మధ్య తరహా పారిశ్రామిక అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మేడా బద్రినాథ్‌, వాల్మీకి కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ నలబోతుల కొండయ్య, ఎంపిడిఒ టి చందన, డిఆర్‌డిఏ ఏరియా కోఆర్డినేటర్‌ సుధాకర్‌, మాజీ జెడ్పిటిసి జవ్వాజి వెంకట రంగారెడ్డి, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ పి శ్రీనివాస్‌రెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ సత్యనారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల సమాఖ్య కమిటీ అధ్యక్షులు, సీసీలు, వివోఏలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

➡️