ఎన్నికల్లో మీడియా పాత్ర కీలకం : కలెక్టర్‌

ప్రజాశక్తి – రాయచోటి ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమగ్రతను, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడంలో మీడియా ఎంతో దోహదం చేస్తుంది. రానున్న సాధారణ, పార్లమెంట్‌ ఎన్నికల్లో మీడియా పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జిల్లాలో త్వరలో నిర్వహించబోయే సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో మీడియా పోషించాల్సిన పాత్రపై ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా ప్రతినిధులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కడప డిసిసి బ్యాంక్‌ డిఆర్‌ ఒఎస్‌డి గుర్రప్ప పవర్‌ పాయింట్‌ ప్రజెంటషన్‌ ద్వారా ఎన్నికలలో మీడియా నిర్వహించాల్సిన పాత్రపై పాత్రికేయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్న సాధారణ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పాత్రికేయులు ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్నికలలో వివిధ విభాగాల లాగానే మీడియా కూడా ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు పారదర్శకంగా స్వేచ్ఛాయిత వాతావరణంలో ఓటు వేయడానికి ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా సహకరించాలన్నారు. ఎన్నికలలో అతి సున్నితమైన వాతావరణం ఏర్పడుతుందని వాస్తవ విషయాల కంటే అసత్యమైన విషయాలే త్వరగా వ్యాప్తి చెందుతాయి అన్నారు. ఏదైనా వార్తను ప్రచురించే ముందు వాస్తవాలను సరిచూసుకొని ప్రచురించాలని పాత్రికేయులను కోరారు. ఫేక్‌ న్యూస్‌లను కాకుండా సత్యమైన, వాస్తవిక దష్టితో వార్తలు ప్రసారం అయ్యేలా మీడియా ముఖ్య భూమిక పోషించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని జిల్లా ఎన్నికల మీడియా కేంద్రం నుంచి ఐఅండ్‌ పిఆర్‌ ద్వారా ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాకు తెలియజేస్తామన్నారు. ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో, చైతన్య పరచడంలో పాత్రికేయులు సహకరించాలని కోరారు. కడప డిసిసి బ్యాంక్‌ డిఆర్‌ ఒఎస్‌డి గుర్రప్ప మాట్లాడుతూ వార్తా కథనాలు ప్రచురించే ముందు వాస్తవాన్ని తెలుసుకొని ప్రచురించాలన్నారు. జిల్లాస్థాయిలో ఎంసిఎంసి కమిటీ కింద మూడు ప్రధాన విధులను కలిగి ఉన్నాయన్నారు. సోషల్‌ మీడియాతో సహా ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాజకీయ ప్రకటనల ముందస్తు ధవీకరణ, చెల్లింపు వార్తల కేసులపై పర్యవేక్షణ, చర్యలు, ఎన్నికల సమయంలో మీడియా ఉల్లంఘన కేసులను పర్యవేక్షిస్తుందన్నారు. ఏదైనా వ్యక్తి పేరుతో ఏదైనా విమర్శలు లాంటి అంశాలపై మీడియా సంస్థలు పాత్రికేయులు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, ఎంసిఎంసి మెంబర్‌ సెక్రటరీ భరత్‌ కుమార్‌ రెడ్డి, డిపిఆర్‌ఒ పురుషోత్తం, కేంద్ర ఫీల్డ్‌ పబ్లిసిటీ అధికారి ధర్మానాయక్‌, జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి, వివిధ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ ప్రతినిధులు హాజరయ్యారు.

➡️