ప్రజాశక్తి – కడప రానున్న సాధారణ, పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల నియమావళిని తూచా తప్పక పాటించి సహకారం అందించాలని కలెక్టర్ వి.విజరు రామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని బోర్డ్ మీటింగ్ హాలులో ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్వరలో నిర్వహించబోయే సాధారణ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నవని, ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర ఎంత ఉందో రాజకీయ పార్టీల నుంచి కూడా అంతే సహకారం అవసరం ఉంద న్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 24 గంటలలోనే పార్టీలకు సంబంధించిన గుర్తులు, పార్టీల నేపథ్యం ఉన్న పర్సన్స్‌కు సంబంధించిన ఫొటోలను అన్ని కార్యాలయాలు, ప్రయివేట్, పబ్లిక్ ప్రదేశాలలో పూర్తిగా తొలగించడంలో సహకారం అందించాలన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు ప్రతి అంశాన్ని సూక్ష్మ దష్టితో పరిశీలిస్తూ చిత్తశుద్ధితో, భాధ్యతాయుతంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మాస్టర్ ట్రైనర్లు పోలింగ్ అధికారులకు పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చామన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌గా గుర్తింపబడిన ప్రతి కేంద్రంలో రెండు వెబ్ కామ్స్, మైక్రో అబ్జర్వర్‌ను నియమించామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలన చేయాలన్నారు. ఇప్పటికే మరణాలు, డబుల్ ఎంట్రీలను ఓటర్ల జాబితా నుంచి వంద శాతం తొలంగించారన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధనతోనే ఏవైనా అభ్యంతరాలను స్వీకరించాలని, యాక్సిలరీ పోలింగ్ స్టేషన్ల కోసం జిల్లాలో 22 అభ్యర్థనలు వచ్చాయని చెప్పారు. తుది జాబితా పరంగా జిల్లాలో మొత్తం 1941 పోలింగ్ స్టేషన్లు ఉండగా అభ్యంతరాలు, అభ్యర్థనలను స్వీకరించి సవరణలు పూర్తి చేయగా ప్రస్తుతం జిల్లాలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 1963కు చేరిందన్నాను. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది తమ విధులను నిర్వర్తించాలని చెప్పారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వారి తరపు ఐటి సహాయకులకు ఎన్నికల నిబంధనలకు సంబంధించిన అన్ని రకాల అంశాలపై అవగాహన పెంచే శిక్షణా కార్యక్రమాలను కూడా పూర్తి చేశారన్నారు. కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాలకు చెందిన ఇఆర్‌ఒలు, కలెక్టరేట్ ఒఎస్‌డి రఘునాధ్‌రెడ్డి, డిఐఒ విజరుకుమార్, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ ధనుంజయ, అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
