ఎవరిని కదిపినా కన్నీళ్లే

Dec 8,2023 22:42 #కన్నీళ్లే
కన్నీళ్లే

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిపిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన సూరంపూడి పేరయ్య ఈ ఏడాది రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టి మూడెకరాల్లో కౌలుకు సాగు చేశాడు. తుపానుకి రెండు రోజులు ముందే యంత్రం ద్వారా కోయగా ఈలోగా ఎడతెరిపి లేని వాన ముంచెత్తింది. ధాన్యం రాశి చుట్టూ నీరు చేరి 40 శాతానికి పైగా నష్టం వాటిల్లింది. ప్రస్తుతం తడిసి ముద్దయిన ధాన్యాన్ని జాతీయ రహదారి వెంబడి ఆరబెడుతున్నా కొనేవారు ఎవరూ రావడం లేదు. తడిసిన ధాన్యాన్ని సైతం వెనువెంటనే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అందుకు తగ్గట్టుగా యంత్రాంగం సిద్ధంగా లేదు. ఆర్‌బికె సిబ్బందిని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ పలువురు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు చెబుతోంది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి అంటూ ఎవరిని కదిపినా ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తుతున్నారు.జిల్లాలో 2.6 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి వేయగా ఇప్పటి వరకు 1.32 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తి చేసిన రైతులు పంట ఒబ్బిడి చేసుకున్నారు. మిగిలిన 50 శాతం పంటపై తుపాను ప్రభావం చూపింది. అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కాకినాడ జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు అతలాకుతలమయ్యారు. రోజులు గడిచే కొద్దీ నష్టం తీవ్రత పెరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరం దాటి మూడు రోజులైనా పొలాల నుంచి వర్షం నీరు మాత్రం అలానే ఉంది. వాగులు ఉప్పొంగి పొలాలను ముంచెత్తడం, ఆధునీకరణ లేక కాలువలు ఆధ్వానంగా మారడంతో నష్టం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా రైతులు నిలిచిపోయిన నీటిని బయటకు తీసేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నీరు బయటకు వస్తుంది.ఆదివారం నాటికి కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నీరు బయటకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ నెల 11 నుంచి ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని లెక్కిస్తామని చెబుతోంది.కోలుకోలేని దెబ్బతుపాను కారణంగా జిల్లాలో 30,462 ఎకరాలు ముంపునకు గురైంది. 567 ఎకరాల్లో మిను ములు, 2,175 ఎకరాల్లో పత్తి, 100 ఎకరాల్లో మొక్కజొన్న ముంపునకు గురై నష్టం జరిగింది. 23,322 ఎకరాల్లో వరి నేలను తాకింది. 75 ఎకరాల్లో మినుములు, 125 ఎకరాల్లో పత్తి, 40 ఎకరాల్లో మొక్కజొన్న నేలను తాకి నష్టం వాటిల్లింది. 26 వేల ఎకరాల్లో వరి నేటికీ నీటిలోనే ఉంది.665 ఎకరాల్లో మినుములు, 2 వేల ఎకరాల్లో పత్తి, 100 ఎకరాల్లో మొక్కజొన్న నేటికీ ఇంకా ముంపులోనే ఉంది. అతికొద్ది రోజుల్లోనే పంట చేతుకొస్తుందనుకున్న తరుణంలో తుఫాను రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటివరకు కూడా రాశుల చుట్టూ చేరిన నీరు ఇంకా బయటకు రాకపోవడంతో ధాన్యం మొలకలు వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా పంటలు వరద నీటిలో మునిగి ఉండటంతో కుళ్లిపోయాయి. ముంపునకు గురైన పంటలు నీరు వెళ్లిపోయిన తర్వాత తొలగించడానికి రైతులు అదనపు సొమ్ములు వెచ్చించాల్సి వస్తుంది. రోడ్లపై పోసి ఆరబెట్టుకునే పనిలో నిమగమయ్యారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా తడిచిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పినప్పటికీ ఆర్‌బికెల పరిధిలో సిబ్బంది ఎవరు ముందుకు రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కొనుగోలు చేస్తున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో నేటికీ ధాన్యాన్ని కొనేవారు లేకుండా పోయారు.

➡️