కడపను సుందర నగరంగా తీర్చిదిద్దాం- కడప ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి

ప్రజాశక్తి-కడప కడప నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దామని కడప ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కార్పొరేటర్‌ పాకా సురేష్‌ ఆధ్వర్యంలో స్థానిక అక్కయపల్లెలోని అక్కాయపల్లె పార్కు, అక్కాయపల్లి ప్లాజా, శాస్త్రి నగర్‌ పార్కులను ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం. రామచంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అక్కాయపల్లి డివిజన్‌కు సంబంధించి దాదాపు రూ.2 కోట్లతో నిర్మించిన పార్కు సుందరీకరణ పార్కును నిర్మించారన్నారు. గత ప్రభుత్వంలో నగరానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ గ్రాంటు తప్ప అభివద్ధి చేయడానికి ఒక్క రూపాయి కూడా నిధులు ఉండేవి కాదని అన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలాది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి పెద్ద ఎత్తున రోడ్డు విస్తరణలు, సుందరీ కరణ, కూడళ్ల సుందరీకరణ, అవసరమైన చోట్ల డ్రైన్‌ నిర్మాణాలు ఇలాంటి మంచి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటీవల కడప నగరానికి సంబంధించి కాంప్రహెన్సివ్‌ వాటర్‌ పైప్‌ లైన్స్‌కు దాదాపు రూ.400 కోట్లు మంజూరు అయిందని చెప్పారు. టెండర్స్‌ కూడా పూర్తయ్యాయని, పనులు కూడా ప్రారంభం కానున్నాయని, ప్రతి ఇంటికీ నీటి కొళాయి ఇచ్చే ఇస్తున్నారని తెలిపారు. తొలుత అక్కాయపల్లెలోని అక్కాయ పల్లె పార్కు, అక్కాయపల్లి ప్లాజా, శాస్త్రి నగర్‌ పార్కులను ప్రారంభించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం జిమ్‌ చేయడానికి ప్రత్యేక పరిక రాలను, పజిల్‌ గేమ్‌, ఆక్యుపంచర్‌ పాత్‌ వే, వాకింగ్‌ చేయడానికి నడకదారులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు పచ్చని గడ్డి, విరివిగా మొక్కలు, రాత్రిపూట వెలుతురు కోసం హైమాస్‌ లైట్లు, రంగురంగుల దీపాలంకరణ, పార్కు చుట్టూ సరికొత్తగా ఇనుప ఫ్రేమ్‌ తో ప్రహరీ ఏర్పాటు తదితరాలను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ నిత్యానంద రెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ పులి సునీల్‌ కుమార్‌, స్థానిక కార్పొరేటర్‌ పాకా సురేష్‌ తోపాటు ఇతర కార్పొరేటర్లు, నాయకులు, నాయకురాళ్లు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️