కలెక్టరేట్‌ నిరసన హక్కుపై ఎస్‌పిని కలిసిన అఖిలపక్షం

Mar 12,2024 14:32 #Dharna Chowk, #Kakinada, #police, #SP

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ వద్ద రాజ్యాంగ హక్కుగా ప్రజలు తమ అవస్థలు తెలుపుకునే నిరసన హక్కు కొనసాగించాలని అఖిల పక్షం నేతలు జిల్లా ఎస్‌.పి ఎస్‌ సతీష్‌ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష బృందం మాట్లాడుతూ.. రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ధర్నాచౌక్‌ మార్చాలని సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు జనవరి 26న నిరాహార దీక్ష చేపట్టిన తరుణంలో ప్రకటించిన హామీ ప్రకారం కలెక్టర్‌ కృతిక్‌ శుక్లా ఆదేశాలతో ఆర్‌ డి ఓ ఇట్ల కిషోర్‌ పలు సార్లు సమావేశమై తుది సమావేశంగా డిఎస్పీ కె హనుమంతరావుతో గత సోమవారం రాత్రి రాజకీయ పక్షాల ప్రజాసంఘాల నాయకులతో రెండుగంటల పాటు ఆర్‌ డివో మీటింగ్‌ హాలులో సుదీర్ఘ సమావేశం నిర్వహించారని తెలిపారు. రెండు రోజుల్లో ఆర్‌డివో నివేదికను ఇస్తున్న దృష్ట్యా పోలీస్‌ శాఖ పరంగా కలెక్టర్‌కు ఇచ్చే నివేదికలో అఖిలపక్షం సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఉప్పు టేరు వద్దకు మార్చిన ధర్నా చౌక్‌ నిర్వహణకు స్థలం కేటాయించకుండా అక్కడి పార్కును వినియోగించడం సుప్రీం కోర్టు ప్రకటించిన నియమాలకు విరుద్ధంగా వుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌ను ఆనుకుని వున్న ముసాఫర్‌ వీధిని రహదారిగా మార్చితే ప్రోటోకాల్‌ వాహనాలకు ప్రత్యేక మార్గం అవుతుందన్నారు. ఇదే ప్రదేశంలో వున్న ట్రావె లర్స్‌ బంగ్లా స్థలం నుండి కూడా మార్గ వినియోగం చేయవచ్చని తెలిపారు. కలెక్టరేట్‌ వద్ద నిరసన హక్కు ప్రదేశం నిర్ణయం చేయాలని ఏకగ్రీవ తీర్మానం ప్రతిని అందజేశారు. కలెక్టరేట్‌ వద్ద ఇబ్బందులు తలెత్తని రీతిలో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం చేపట్టే చర్యలకు పోలీస్‌ శాఖ సహకరిస్తుందని ఎస్‌ పి పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, బిజెపి, టిడిపి, జనసేన ఆమ్‌ ఆద్మీ, బిఎస్‌పి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఆల్‌ ఇండియా, ఫార్వర్డ్‌ బ్లాక్‌, పౌర సంక్షేమ సంఘం, మాల మహానాడు, మాదిగ దండోరా, సిఐటియు, ఏఐటియుసి, టిఎన్‌టియుసి, ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, ఎఐస్‌ఎఫ్‌, రైతుసంఘం, ఐద్వా, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌, మానవ హక్కుల సంఘం, రేట్‌ పేయర్స్‌ అసోసియేషన్‌, వినియోగదారుల సంఘం, చిరువ్యాపారుల, బడ్డీ యాజమానుల సంఘాలు పాల్గొన్నాయి.

➡️