కుందూలో నీట మునిగి ఇద్దరు మృతి

ప్రజాశక్తి-ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం పరిధిలో ఉన్న కుందూ నదిలో నీట ముగిని ఇద్దరు మృతిచెందారు. వివరాలు.. నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణానికి చెందిన షేక్‌ ఖాజాహుస్సేన్‌, అతని భార్య షేక్‌ ఇమాంబీ (27), బావమరిది ఫకీరా మస్తాన్‌ (26) అదే మండలంలోని ఎర్రగుంట్ల వద్దనున్న దర్గాకు పయనమయ్యారు. ఇమాంబీకి ఆరోగ్యం సరిగ్గా లేనందున దర్గా వద్ద పూజ కోసం వెళ్లారు. తిరిగి చాగలమర్రికి వెళ్తూ వైఎస్‌ఆర్‌ జిల్లా రాజుపాలెం మండల పరిధిలోని కులూరు గ్రామం కుందూ నదిలో స్నానం చేయడానికి దిగారు. వారిలో హుస్సేన్‌ కట్టపైనే ఉన్నారు. నదిలోదిగిన ఇమాంబీ, ఫకీరా మస్తాన్‌ ప్రమాద వశాత్తు నీట మునిగారు. సమీపంలోని రజకులు గుర్తించి నీట మునిగిన ఇద్దరిని వెలికి తీశారు. అప్పటికే వారు ఊపిరి ఆడక మృతిచెందారు. ఖాజాహుస్సేన్‌ ఫిర్యాదు మేరకు ఎఎస్‌ఐ సిద్దయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️