కొరడా!

Mar 30,2024 21:03 #కొరడా!

ఎన్నికల కమిషన్‌ కొరడా ఝులిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాలంటీర్లు మొదలుకుని జిల్లా ఉన్నతాధికారుల వరకు ఎవరినీ ఉపేక్షించడం లేదు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా 14 మంది వాలంటీర్లపై వేటు వేసింది. గత 15 రోజుల కిందట కలసపాడుకు చెందిన ఓ దిగువ స్థాయి ఉద్యోగిశ్రీతీ, తాజాగా డిసిసిబి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌పైనా వేటు వేసింది. జిల్లా ఉన్నతాధికారుల్లో ఉలికిపాటుకు గురిచేసింది. టిడిపి ఎమ్మెల్సీ రాంగోవింద్‌రెడ్డి డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈయనతోపాటు మరో ఉన్నతాధికారిపై కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ముగ్గురు ఎస్‌పిలపై ఫిర్యాదు చేయడం, ఇసి వివరణ కోరడం వంటి పరిణామాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయ రాష్ట్ర ఉత్సవాల నేపథ్యంలో కలెక్టర్‌ ఉత్సవ నిర్వహణ అధికారులను అప్రమత్తం చేశారు. ఎటువంటి పొరపాటు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించడం గమనార్హం. ఎన్నికల ప్రచారాలకు సైతం అనుమతి తీసుకోవాలని ఇసి కోరుతుండడంపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ఇటు వంటి తరహా ధోరణి లేదు. తాజాగా ఇటువంటి నిబంధన అమలు చేయడం జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగుల దగ్గరి నుంచి రాజకీయ నాయకులు, చివరికి మీడియా వరకు అన్ని వ్యవస్థలపైనా ఎన్నికల కమిషన్‌ డేగకన్ను వేసింది. ఇదేతరహా నిబంధనలతో కూడిన వాతావరణం చివరి వరకు సాగితే పటిష్టమైన, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సాగే అవకాశం ఉంటుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు ఎలా ఉల్లంఘనలకు గురయ్యాయో తెలిసిందే. ఇటువంటి వాతావరణానికి భిన్నమైన రీతిలో ఎన్నికల కమిషన్‌ సాగుతుండడం ప్రశంసనీయమనే చెప్పాలి. ప్రజా స్వామిక వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాప్రాయానికి మన్నిక దక్కుతుంది. ఫలితంగా ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం సజా వుగా పాలన చేయడానికి అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో బడితే ఉన్న వాడితే రాజ్యమనే వాతావరణం ఏర్పడు తుంది. ప్రజాస్వామ్యానికి ఎనలేని హాని జరుగుతుంది. ఫలి తంగా ఇటువంటి ధోరణి నియంతృత్వానికి దారి తీస్తుందని చెప్పవచ్చు.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️